శ్రీనగర్, జూన్ 4,
ప్రశాంత వాతావరణంలో అలరారే జమ్మూ-కశ్మీర్ లో వేడి రాజుకుంది. కొన్ని రోజులుగా ఉగ్రదాడులు జరుగుతుండటంతో కశ్మీరీ పండిట్లలో భయం మొదలైంది. దక్షిణ కాశ్మీర్ కుల్గాం జిల్లాలోని గోపాల్‌పొరా ప్రాంతంలో హైస్కూల్ హిందూ ఉపాధ్యాయురాలి హత్యోదంతంతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఆందోళన నెలకొంది. దీంతో తమను వేరే ప్రాంతానికి బదిలీచేయాలన్న డిమాండ్లు అధికమయ్యాయి. వీరి ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్న 177 మంది పండిట్ టీచర్లను బదిలీ చేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కశ్మీర్‌లో వరస హత్యలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న ఆర్మీ చీఫ్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ ఉన్నతాధికారులలో సమావేశమయ్యారు. 1990ల్లో కశ్మీర్ లోయలో అల్ప సంఖ్యాక వర్గాలపై జరిగిన మారణకాండతో ఆ ప్రాంతం నుంచి వేలాది కశ్మీరీ పండిట్ కుటుంబాలు వలస వెళ్లాయి. అయితే వీరిని తిరిగి స్వస్థలాలకు రప్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ప్రధానమంత్రి ప్రత్యేక పునరావాస ప్యాకేజీ కింద వేలాది మందికి ఎస్సీ కోటాలో ఉద్యోగాలిచ్చి కశ్మీర్ లోయలో నియమించింది.జమ్మూ- కశ్మీర్ కుల్గాం జిల్లాలోని గోపాల్‌పొరా ప్రాంతంలో హైస్కూల్ హిందూ ఉపాధ్యాయురాలిని పొట్టనబెట్టుకున్నారు. ఉగ్రవాదులు గత మంగళవారం ఉదయం ఆమెపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, పోలీసుల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని.. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. మృతురాలిని రజనీ భల్లాగా పోలీసులు గుర్తించారు. రజనీ జమ్మూ డివిజన్‌లోని సాంబా జిల్లా నివాసి అని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. కాల్పులకు తెగబడ్డ వారిని త్వరలోనే గుర్తించి.. మట్టుబెడుతామన్నారు.