విజయవాడ, జూ్ 6,
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఆలోచనలో పడింది. ఎవరినీ దీనిపై కామెంట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా సీనియర్ నేతలకు, పార్టీ అధికార ప్రతినిధులకు ఈ ఆదేశాలు అందినట్లు తెలిసింది. పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అప్పటి వరకూ ఆయన వ్యాఖ్యలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. తాము గతంలో తగ్గామని, ఈసారి మిగిలిన పక్షాలు తగ్గాలని పవన్ చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి కామెంట్స్ చేయకుండా టీడీపీ నేతలను అధిష్టానం కట్టడి చేసింది. మహానాడు సక్సెస్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఊపు వచ్చింది. కార్యకర్తల్లో పెల్లుబుకుతున్న ఉత్సాహం తమను విజయం వైపునకు తీసుకువెళుతుందన్న ధీమాతో టీడీపీ నేతలు ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో కిందిస్థాయిలో జనసేన, టీడీపీ ద్వితీయ శ్రేణి నేతల మధ్య సవాళ్లు మొదలయ్యాయి. జనసేనకు బలం లేదని, టీడీపీ నాయకత్వాన్ని అంగీకరిస్తేనే మంచిదని, ప్రజలు టీడీపీ వైపు ఉన్నారని టీడీపీ నేతలు అంటుండగా, జనసేన నేతలు మాత్రం ఈసారి తమ ఓటు బ్యాంకు ద్వారానే విజయం లభిస్తుందన్న విషయాన్ని విస్మరించవద్దని అంటున్నారు. ఇలా కిందిస్థాయిలో మొన్నటి వరకూ సఖ్యతగా ఉన్న జనసేన, టీడీపీ వర్గాలు ఇప్పుడు సవాళ్లు విసురుకుంటున్నాయి. ఎవరూ తమ ఆధిపత్యాన్ని వదులుకునేందుకు సిద్ధపడటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రాంతంలో రెండు పార్టీల క్యాడర్ ఒప్పందం కుదుర్చుకుని బరిలోకి దిగాయి. కొన్ని సీట్లను కైవసం చేసుకున్నాయి. అధినాయకులతో సంబంధం లేకుండా కుదుర్చుకున్న పొత్తులు సానుకూల ఫలితాలు ఇచ్చాయి. అయితే టీడీపీ నేతలు మాత్రం మరోమారు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. జనసైనికులు మాత్రం ఈసారి పవన్ కల్యాణ్ కు ఛాన్స్ ఇవ్వల్సిందేనని పట్టుబడుతున్నారు.
దూకుడు పెంచిన జనసేన
ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ దూకుడు పెంచింది. పవన్ కళ్యాణ్‌ను ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్న జనసేన మరో వైపు క్షేత్రస్థాయిలో తన పని తాను చేసుకుపోతోంది. ఈ కృషిలో పాలుపంచుకోవాలని చిరంజీవి ఫ్యాన్స్‌ను ఆ పార్టీ కోరింది. అభిమాన సంఘాలన్నీ రాజకీయ ప్రక్రియలో భాగం కావాలని మెగా అభిమానులను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో చిరంజీవి యువత ప్రతినిధులతో మనోహర్ సమావేశమయ్యారు. ఇందులో భాగంగా మెగా అభిమాన సంఘాల నాయకులతో నాదెండ్ల మనోహర్ మంగళగిరిలో సమావేశయ్యారు. అంతా ఇంటిగ్రేట్ అవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ముందుకు వెళ్లి బాధితులకు సాయం అందించడంలో చిరంజీవి అభిమానులు ఎప్పుడూ ముందుంటారని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు.అభిమాన సంఘాలు రాజకీయ ప్రక్రియలో భాగమై మరోసారి పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి చేయడానికి మెగా అభిమానులు కృషి చేయాలని కోరారు. వంద శాతం జనసేన జెండా మోసేందుకు అంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. గ్రామస్థాయి వరకు పార్టీని తీసుకువెళ్లాలని సూచించారు.పార్టీ ప్రయాణంలో అభిమానులకు స్థానం కల్పించే ఏర్పాటు చేస్తామని నాదెండ్ల చెప్పారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు త్వరలో కిట్లు పంపిణీ చేస్తామని, అలాగే వచ్చే నెల నుంచి శిక్షణా తరగతులు ఉంటాయని.. అందులో అభిమాన సంఘాలు భాగస్వాములు కావాలన్నారు. క్షేత్రస్థాయిలో అభిమాన సంఘాలను పార్టీలో కలిపే ప్రక్రియను మూడు నెలల్లో పూర్తిచేద్దామన్నారు. జనసేన విజయంలో తమవంతు పాత్ర పోషించేందుకు చిరంజీవి యువత ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తంచేశారు