నెల్లూరు, జూన్ 6,
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక బరిలో బీజేపీ తన అభ్యర్థిని దింపుతోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ పోటీకి సై అన్నారు. ‘కుటుంబ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ‘వైసీపీకి దమ్ముంటే ఓట్లు కొనకుండా.. ఓటర్లను మంత్రులు ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికలో గెలవాల’ని సవాల్ చేయడాన్ని పరిశీలకులు ఒక పెద్ద జోక్ గా అభివర్ణిస్తున్నారు. ‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింద’నే సామెతను సోము వీర్రాజు మాటలు గుర్తుచేస్తున్నాయంటున్నారు. ఓట్లు రావు.. గెలుపు సాధ్యం కాదు.. కనీసం డిపాజిట్ అయినా అనుమానమే.. అయినా.. తగుదునమ్మా అంటూ ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా కమలం పార్టీ పోటీకి సై అంటూ పోటీలో ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ లోని ఏ నియోజకవర్గంలోనూ బీజేపీకి కనీస స్థయి ఓట్లు కూడా లేవనేది నూటికి నూరుపాళ్లూ వాస్తవం. రాష్ట్రంలో పొత్తులు లేకుండా కనీసం ఒక్క స్థానం కూడా గెలిచిన సందర్భం లేదు. అలాంటిది.. సోము వీర్రాజు అధికార వైసీపీని సవాల్ చేయడం, ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలన్న టీడీపీ నిర్ణయాన్ని వేలెత్తి చూపడం అతి చేయడమేనని పరిశీలకులు అంటున్నారు. రాజకీయ వర్గాలలో అయితే అసలాయన తెలివి ఉండే మాట్లాడుతున్నారా? అన్న చర్చ జరుగుతోంది. గతంలో ఏపీలో నలుగురు బీజేపీ అభ్యర్థులు గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కారంటే అందుకు అప్పట్లో ఆ పార్టీకి తెలుగుదేశంతో పొత్తు ఉండటమే కారణం అనడంలో సందేహం లేదు.ఆ విషయాన్ని మరచి, సోము వాగాడంబరానికి పోవడం జోక్ కాక మరేమిటని నిలదీస్తున్నారు. టీడీపీకి స్థిరమైన సిద్ధాంతం లేదట. ఎంత మాట.. ఎంత మాట.. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదో చెప్పాలట. ఇలాంటి డిమాండ్ ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేయడం చోద్యంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. సోము వీర్రాజు తీరు ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ఉందని ఎద్దేవా చేస్తున్నారు.పైగా మంత్రుల్ని ఎన్నికల ప్రచారంలో దింపకుండా , డబ్బులు పంచకుండా కేవలం అభ్యర్థులు మాత్రమే ప్రచారంలో పాల్గొని గెలవాలని సోము వీర్రాజు అధికార వైసీపీకి సవాల్ చేస్తున్నారట. సోము వీర్రాజు మాటలు వింటుంటే.. ‘నేను కొట్టినట్టు నటిస్తా.. నువ్వు ఏడ్చినట్లు యాక్ట్ చెయ్యి’ అన్నట్లు ఉందంటున్నారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అనే ట్యాగ్ తో తన అభ్యర్థిని బరిలో దింపుతున్న బీజేపీ.. లోపాయికారీగా వైసీపీతోనే అంటకాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ సర్కార్ తీసుకునే ఏ నిర్ణయానికైనా జగన్, జీ హుజూర్ అనడం అందరికీ తెలిసిన విషయమే కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాగే.. జగన్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా.. ప్రధాని మోడీ సహా కేంద్రంలోని పెద్దలు అపాయింట్ మెంట్ ఇస్తూనే ఉండడం గమనార్హం. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్రం పెద్దల నుంచి ఏపీ కోసం జగన్ రెడ్డి ఏమి వరాలు తెస్తారో తెలియదు కానీ.. సొంత విషయాల మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తుంటాయి. ఢిల్లీ స్థాయి పెద్దలు జగన్ రెడ్డికి అనుకూలంగా ఉంటారు. ఏపీలోని బీజేపీ నేతలు మాత్రం జగన్ పార్టీకి సవాళ్లు విసురుతుంటారు. అంటే ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అన్నట్లు ఆ రెండు పార్టీల తీరూ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఒక పక్కన బీజేపీతో తాను పొత్తులో ఉన్నదీ లేనిదీ జనసేన అధినేత డైరెక్ట్ గా ఎప్పుడూ ఎక్కడా చెప్పరు. కానీ.. రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు మాత్రం జనసేనతో, పవన్ కళ్యాణ్ తో తమ దోస్తీ కొనసాగుతోందనే చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు.