అమరావతి జూన్ 6
విజయవాడ అంటే విజయానికి సంకేతం అందుకే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ మార్పునకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పిలుపునిచ్చారు. విజయవాడలో బీజేపీ బూత్‌స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ స్కీం పేరును ఏపీ సీఎం జగన్ మార్చి ఆరోగ్యశ్రీ పేరిట అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తున్న నిధులు కిందిస్థాయి వర్గాలకు అందుతున్నాయా? లేదా అని పరిశీలించి వారికి అండగా నిలవాలని కోరారు.నిరుపేదలకు మంజూరు చేస్తున్న ఇండ్లు, తదితర వాటి వల్ల కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకోవాలని కార్యకర్తలకు వెల్లడించారు. కేంద్రం రైతులకు అందజేస్తున్న నగదు పథకం గురించి వివరించాలని కోరారు. ఏటా రెండు లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమాచేస్తుందని నడ్డా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ఏపీకి అందజేస్తున్న పథకాలను ప్రజానికానికి స్పష్టంగా తెలియజేయాలని కోరారు.భారత దేశాన్ని సురక్షిత దేశంగా ఉంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని సూచించారు. ఏపీలో పదివేలకు పైగా శక్తి కేంద్రాలున్నాయని ,వీటిలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని సూచించారు.