ఐపీఎల్-11 ప్లేఆఫ్స్ బెర్తుల పోరాటానికి రంగం సిద్ధమైంది. ఈ రోజు, రేపు జరిగే మ్యాచ్లలో ఎవరు మూడు,నాలుగు స్థానాలలో ఉండబోయేది తెలుస్తుంది. ఇప్పటికే చెన్నై,హైదెరాబ్ మొదటి రెండు స్థానాలలో ఉన్నారు. రెండు బెర్తుల కోసం పోటీలో ఉన్న ఐదు జట్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ పరిస్థితి అందరికంటే మెరుగ్గా ఉంది. ఆ జట్టు 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో (14 పాయింట్లు) మూడో స్థానంలో ఉంది. శనివారం రాత్రి సన్‌రైజర్స్‌తో మ్యాచ్ నెగ్గితే కోల్‌కతా ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుంది. ఎంత తేడాతో గెలుస్తుందన్నదాన్ని బట్టి స్థానం ఖరారు కావచ్చు. ఆ జట్టు ఓడినా మిగతా ఫలితాల్ని బట్టి ముందంజ వేసే అవకాశముంది.
పాయింట్ల పట్టికలో 4 నుంచి 7వ స్థానం వరకు ఉన్న నాలుగు జట్లకూ సమాన పాయింట్లున్నాయి. అవి 13 చొప్పున మ్యాచ్‌లాడి ఆరేసి విజయాలు సాధించాయి. ఐతే నెట్‌రన్‌రేట్ మెరుగ్గా ఉన్న ముంబయి (0.384) నాలుగో స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో బెంగళూరు (0.264), రాజస్థాన్ (-0.399), పంజాబ్ (-0.490) కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం రాజస్థాన్‌తో బెంగళూరు తలపడబోతోంది. ఆదివారం సాయంత్రం దిల్లీని ముంబయి, రాత్రి చెన్నైని పంజాబ్ ఢీకొంటాయి.