అమరావతి జూన్ 6
ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపైన అటు రాజకీయ పార్టీల్లోనూ ఇటు సాధారణ ప్రజల్లోనూ ఇంకోవైపు టీవీ చానెళ్లలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు సంబంధించి తన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి.. జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం రెండోది.. జనసేన-బీజేపీ-టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మూడోది.. ఒంటరిగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం. తద్వారా పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తుల విషయంలో తన మనసులోని మాటను ఎలాంటి దాపరికాలు లేకుండా ఎలాంటి అస్పష్టతకు తావివ్వకుండా కుండబద్దలు కొట్టేశారు.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలు మీడియా సంస్థలు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను విశ్లేషించే పనిలో పడ్డాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల ఉద్దేశం ఆయన మాటల్లోని అంతరార్థం ఒకటేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి జగన్ మోహన్ రెడ్డికి ఒక అవకాశమిచ్చారు.. కాబట్టి ఈసారి 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా తనకు కూడా ఒక చాన్సు ఇవ్వాలనేదే పవన్ కల్యాణ్ ఉద్దేశమని చెబుతున్నారు. పవన్ వ్యాఖ్యల్లో నిగూఢార్థం పరమార్థం ఇదేనని పేర్కొంటున్నారు.అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సహజంగానే అధికార వైఎస్సార్సీపీ బెంబెలెత్తుతోందని చెబుతున్నారు. దమ్ముంటే పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు సవాళ్లు విసరడం రంకెలు వేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. మరోవైపు టీడీపీ కౌంపౌండ్ ప్రస్తుతం సైలెంట్ గా ఉంది. మహానాడు సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న ఆ పార్టీ పవన్ వ్యాఖ్యలపై ఆచితూచి స్పందించాలని యోచిస్తోంది. మరోవైపు బీజేపీ పవన్ కల్యాణ్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి జనసేన -బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.ప్రజల్లో ముఖ్యంగా కాపు సామాజికవర్గంలో పవన్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని అంటున్నారు . అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లిన వైఎస్ జగన్ ను ఎన్నో కేసుల్లో కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్న చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎలాంటి మచ్చ అవినీతి ఆరోపణలు లేని పవన్ కల్యాణ్ కు కూడా ఒక చాన్సు ఇస్తే తప్పేముందని వాళ్లు అనుకుంటున్నారని అంటున్నారు.ముఖ్యంగా రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గం కాపులు పవన్ కల్యాణ్ ప్రకటనపై పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సమాన సీట్లలో పోటీ చేయడం లేదా అధికారాన్ని పంచుకోవడం వంటి వాటి ప్రాతిపదికగానే పొత్తులు ఉంటాయని.. అంతేకానీ ఎవరినో పల్లకీ ఎక్కించడానికి తాము సిద్ధంగా లేమని పవన్ కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మాటల్లో అంతరార్థం నిగూడార్థం తనకు కూడా ముఖ్యమంత్రిగా ఒక చాన్సు ఇవ్వండనేదే పవన్ ఉద్దేశమని బల్లగుద్ది చెబుతున్నారు.