విజయవాడ, జూన్ 7,
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డా రెండు రోజుల ఏపీ రాష్ట్ర పర్యటించారు. సోమవారం ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న నడ్డా.. విజయవాడ సిద్దార్ధ కాలేజీ మైదానంలో బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖ్‌ల సభలో పాల్గొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలనే సంకేతంతో పాటుగా, శక్తి కేంద్ర ప్రముఖ్‌లకు మార్గదర్శనం చేశారు. అయుష్ మాన్ భారత్, తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలని నేతలకు తెలిపారు.ఆయుష్మాన్ భారత్‌ను జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీగా మార్చిందని అన్నారు. ఆరోగ్యశ్రీ జగన్ పథకం కాదని.. కేంద్ర ప్రభుత్వ పథకమని చెప్పుకొచ్చారు. సౌభాగ్య కార్యక్రమం రెండున్నర కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రయోజనం కల్పిస్తున్నామని జేపీ నడ్డా పేర్కొన్నారు.ఇంకా చాలా విషయాలు ఆయన చెప్పు కొచ్చారు. అయితే, ఇంచు మించుగా గంటకు పైగా సాగిన ప్రసంగంలో, నడ్డా ఎక్కడా, మిత్ర పక్షం జనసేన ప్రస్తావన చేయలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్’ను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని ఆ పార్టీ గత రెండు మూడు రోజులుగా చేస్తున్న ‘డిమాండ్’ అంశాన్ని అసలు ప్రస్తావించనే లేదు. ఆయన పూర్తిగా బీజేపీ సంస్థాగత వ్యవహారాలకే పరిమితమయ్యారు. అయితే, నడ్డా ఏపీలో అడుగుపెట్టడానికి ముందే, గన్నవరం విమానశ్రయంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, జనసేనకు షాకిచ్చారు.. పవన్ కళ్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన నేతలు చేస్తున్న డిమాండ్‌పై నడ్డా ఎలాంటి ప్రకటన చేయరు అని తెగేసి చెప్పారు. ఎవరో డిమాండ్ చేస్తే సీఎం అభ్యర్థిని ప్రకటించడం కుదరదన్నారు. బీజేపీని ఏపీలో బలీయమైన శక్తిగా మార్చడమే లక్ష్యంగా నడ్డా ఏపీ పర్యటనకు వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. నడ్డా వచ్చేది సీఎం అభ్యర్థి విషయమై మాట్లాడటానికి కాదని జీవీఎల్ తెలిపారు. కాబట్టి సీఎం అభ్యర్థిపై నడ్డా పర్యటన సందర్భంగా ఎలాంటి ప్రకటన ఉండదని ఆయన స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది జాతీయ స్థాయి నేతలు నిర్ణయిస్తారని.. తాము కాదని ఆయన తెలిపారు. మరో వంక నడ్డా, పవన్ కళ్యాణ్’ను ముఖ్యమంత్రిగా ప్రకటించక పొతే, రెండు రోజుల తర్వాత భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామని జనసేన నాయకులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో బీజేపీ, జనసేన పొత్తు ఉంటుందా ? ఊడుతుందా? అనేది అనుమానంగా మారింది. అదలా ఉంటే, జీవీఎల్ వ్యాఖ్యలపై స్పందించిన, జనసేన నాయకుడు పసుపులేటి హరిప్రసాద్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే గెలిచి అధికారంలోకి వచ్చే సత్తా తమ పార్టీకి ఉందని.. కానీ కేంద్రంతో సఖ్యతతో ఉంటే రాష్ట్రానికి ప్రయోజకరం అనే ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. మరోవంక జనసేన అధినేత్ పవన్ కళ్యాణ్ సమయం సందర్భం లేకుండా, పదే పదే పొత్తుల ప్రస్తావన ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఒక మాట మీద నిలవకుండా, ఎప్పటికప్పుడు మాట మారుస్తున్నారు? కొత్త కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారు? అనే చర్చ జరుగుతోంది. ముందు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత తీసుకుంటాని ప్రకటించారు. బీజేపీ జాతీయ నాయకులతో ఏమి మట్లాడారో, ఏమి మాట్లాడలేదో ఏమో కానీ, బీజేపీ, టీడీపీలను కలిపే బాధ్యత కూడా తమదేనని, తనంతట తానే ప్రకటించారు. ఇప్పుడు అవన్నీ పక్కకు నెట్టి, బైబిల్ సూక్తులను ఉటంకిస్తూ, పొత్తులకు సంబంధించి మూడు ఆప్షనల్’తో కొత్త ఫార్ములాను తెర మీదకు తెచ్చారు. కొత్త ఫార్ములాలో పవన్ కళ్యాణ్ మూడు ఆప్షనల్స్ ప్రస్తావించినా, అన్నిటి సారం, సారంశం ఒక్కటే... రాష్ట్రంలో 40 శాతం ఓటున్న టీడీపీ, కేంద్రంతో పాటుగా దేశంలో 18 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ, బోయీలుగా మారి తమను అధికార పల్లకీలో ఎక్కించాలని, పవన్ కళ్యాణ్ అద్భుత ప్రతిపాదన చేశారు.దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్’ ఉద్దేశంఏమిటి? ఎన్నికలు ఇంకా చాల దూరంలో ఉండగానే ఆయన పొత్తుల తేనే తుట్టెను ఎందుకు కదిపారు? వైసేపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు, ప్రతిపక్షాల మధ్య చిచ్చు పెట్టడం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఎవరి ప్రోద్బలంతో, పవన్ కళ్యాణ్ ప్రజలలో రాజకీయ గందరగోళం సృష్టిస్తున్నారు.ఓ వంక వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగతున్న నేపధ్యంలో ప్రజలు తెలుగు దేశం వైపు చూస్తున్న సమయంలో, పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాల మద్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. తమ్ముడు పవన్, అన్నయ్య చిరంజీవి బాటలో నడుస్తున్నారా? ప్రతిపక్షం ఓట్లను చీల్చి, చివరకు అన్న చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని తల్లి కాంగ్రెస్’లో కలిపినట్లు, తమ్ముడు పవన్, జనసేనను పిల్ల కాంగ్రెస్’లో కలిపేందుకు, డీల్ కుదుర్చుకున్నారా? ఈ డీల్ వెనక ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయా? అంటే, పరిశీలకులు కాదనలేమనే అంటున్నారు.