విజయనగరం, జూన్ 7,
బొత్స సత్యనారాయణ పవర్‌లోనే ఉన్నా... పార్టీలో ఆయన పవర్ క్రమ క్రమంగా తగ్గిపోతోందా? ఆ క్రమంలో సొంత జిల్లా విజయనగరంపై ఆయన పట్టుకోల్పోతున్నారా? జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ తెలుగుదేశంలోని జంప్ అవుతోందా? అంటే ఔననే సమాధానమే వస్తుంది. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ క్యాడర్ సైకిలెక్కడానికి సిద్ధమౌతోంది. ఒక్క చీపురుపల్లి అనేమిటి.. విజయనగరం జిల్లా మొత్తంగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు పెరుగుతున్నాయి. దీంతో బొత్స సత్యన్నారాయణకుపార్టీ అధిష్ఠానం ఆగ్రహ సెగ తగులుతోందట. తాడేపల్లి ప్యాలస్ విజయనగరం జిల్లాలో పార్టీ నుంచి వలసలపై వస్తున్న ప్రశ్నల శరాలు తట్టుకోలేక బొత్స ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.దీంతో అసలు విజయనగరంలో ఏం జరుగుతోందో తెలియక పార్టీ అగ్రనేతలు.. ఉత్తరాంద్ర ఇన్‌చార్జ్ వై వీ సుబ్బారెడ్డిని ఆశ్రయించి.. జిల్లాలో చోటు చేసుకొంటున్న తాజా పరిణామాలపై దృష్టి సారించి నివేదిక ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన వైవీ సుబ్బారెడ్డి.. జిల్లాలో కేడర్ జంపింగ్ కావడానికి గల రీజన్, రీజనింగ్ పై ఆరా తీయగా.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. విజయనగరం జిల్లా అంటేనే బొత్స సత్తిబాబు.. బొత్స సత్తిబాబు అంటేనే విజయనగరం జిల్లా అనుకునే పరిస్థితి నుంచి బొత్స సత్తిబాబు అండ్ కో.. ఒంటెద్దు పోకడలతో.. ఏక పక్ష నిర్ణయాలతో బొత్స ఉంటే విజయనగరంలో వైసీపీ ఖాళీ అనే పరిస్థితి ఏర్పడిందట. బొత్స వైఖరిని చూసి జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఇదే ధోరణి అవలంబిస్తున్నారని.... దాంతో క్యాడర్ విసిగి వేశారిపోయి బొత్స, ఇతర ఎమ్మెల్యేల తీరుపై బాహటంగానే విమర్శలు గుప్పిస్తూ.. సైకిల్ ఎక్కేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డికి అందిన సమాచారం. అలాగే జగన్ పరిపాలనపై ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకత కూడా జిల్లా నుంచి వలసలకు ఒక కారణం అన్న సమాచారం కూడా వైవీ సుబ్బారెడ్డి ఆరాలో తేలిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.వైయస్ జగన్ తొలి కేబినెట్‌లోనే కాదు.. మలి కేబినెట్‌లో సైతం బొత్స సత్యనారాయణ మంత్రిగా కొనసాగుతున్న సంగతి విదితమే. అయితే జగన్ మలి కేబినెట్‌లో బొత్సకు చోటు దక్కకపోవచ్చుననే చర్చ బాగానే జరిగింది. విజయనగరం ఎమ్మెల్యే కె.వీరభ్రదస్వామికి మంత్రి పదవి కట్టబెడదామని తొలుత సీఎం జగన్ భావించారని సమాచారం. కానీ వచ్చే ఎన్నికల్లో జిల్లాలో మళ్లీ ఫ్యాన్ పార్టీ సత్తా చాటాలంటే.. తనకు కేబినెట్ కొలువు తప్పని సరి అని బొత్స సత్తిబాబు జగన్ పై ఒత్తిడి పెంచడంతో తప్పని సరి పరిస్థితుల్లో ఒకింత అయిష్టంగానే జగన్ బొత్సకు కేబినెట్ లో చోటు పదిలం చేశారని చెబుతున్నారు.అయితే ఒకింత అప్రాధాన్యత ఉన్న కేబినెట్ పోర్టుపోలియో కట్టబెట్టడంతో బొత్స రగిలిపోయారని సమాచారం. ఆయన తన శాఖను అంటే విద్యాశాఖను పట్టించుకోకపోవడం వల్లనే టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ, ఆ తరువాత చివరి నిముషంలో ఫలితాల విడుదల వాయిదా వంటి అంశాలు చోటు చేసుకున్నాయని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత తొలిసారి జరిగిన ఎన్నికలలో బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఘోర పరాజయం పాలైన సంగతి విదితమే. తదుపరి ఎన్నికలలో ఆయన విజయం సాధించినా అది ఫ్యాను గాలి స్పీడ్ తోనే అని వైసీపీ శ్రేణులు ఇప్పుడు విశ్లేషణలు చెబుతున్నారు.ఆయనకు తన సొంత నియోజకవర్గంపై, జిల్లాపై నిజంగానే పట్టు ఉంటే 2014 ఎన్నికలలోనే జిల్లాలో పట్టు నిరూపించుకుని ఉండేవారు కదా అంటున్నారు. జిల్లాలో అన్ని విధాలుగా పరపతి కోల్పోయిన బొత్స సత్యనారాయణకు జగన్ పార్టీ అండతోనే ఎమ్మెల్యేగిరీ, మంత్రిపదవీ దక్కాయని వైసీపీ క్యాడర్ చెబుతోంది. అటువంటి వ్యక్తి తన ఒంటెత్తు పోకడలతో క్యాడర్ ను పార్టీకి దూరం చేస్తున్నారని పలువురు జిల్లా నేతలు వైవీ సుబ్బారెడ్డికి నివేదించినట్లు సమాచారం. బొత్స ఒంటెత్తు పోకడ కారణంగానే జిల్లాలో దాదాపు 2000 మంది వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగేదేశం గూటికి చేరారని వైవీకి నివేదిక అందిందంటున్నారు.ఆ తరువాత బొత్స రంగప్రవేశం చేసి నష్ట నివారణకు చర్యలు చేపట్టినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉందని అంటున్నారు. జిల్లా కేంద్రం విజయనగరంలోని వార్డుల నుంచి జిల్లా చిట్ట చివర నియోజకవర్గం వరకు ఫ్యాన్ పార్టీలోని కేడర్ మొత్తాన్ని లక్ష్యంగా చేసుకోని.. సైకిల్ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. దీంతో ఫ్యాన్ పార్టీలోని కేడర్‌నే కాదు.. లీడర్లను సైతం సైకిల్ ఎక్కించే పనిలో తెలుగు తమ్ముళ్లు.. ఫిక్స్ అయిపోయారని సమాచారం. జిల్లాలో వైసీపీ బలం, ప్రతిష్ట వేగంగా దిగ జారిపోతుండటంతో పార్టీలో బొత్స ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనీ, పార్టీ అధిష్ఘానం ఆగ్రహానికి ఉక్కపోతకు గురౌతున్నారని పార్టీ క్యాడరే బొత్స మీద సెటైర్లు వెస్తున్నది.