విజయవాడ, జూన్ 7,
ఏపీలో ముఖ్యమంత్రి రేసు కాక రేపుతోంది. ఎన్నికలకు రెండేళ్ళ ముందే ముఖ్యమంత్రి అంశం చర్చకు రావడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తున్నా ఈ చర్చ వెనుక మూడు పార్టీల రాజకీయ చదరంగం వుండడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారుతోంది. రెండు రోజుల క్రితం జనసేన ఇక ఏ మాత్రం త్యాగాలు చేయబోదని, పొత్తుల కోసం సీట్ల త్యాగాలు ఇక వుండవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన తర్వాత సీఎం రేసుపై చర్చ మొదలైంది. దానికి తగ్గట్టుగా బీజేపీ, జనసేన పార్టీల నేతలు ఎవరి వ్యూహాలకు అనుగుణంగా వారు ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ, జనసేన మధ్య మిత్రబంధం కొనసాగుతుందన్న సంకేతాలిస్తూనే సీఎం సీటు మాదేనని పవన్ పార్టీ శ్రేణులు ఖరాఖండిగా చెబుతున్నారు. రాష్ట్ర శాసనసభలో ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన, బీజేపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి తమ అధినేత పవన్ కల్యాణేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 2014లో ఏర్పాటైన జనసేన పార్టీ.. ఆనాటి ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండిపోయింది. టీడీపీ, బీజేపీల పక్షాన పవన్ ప్రచారం చేశారు. 2019 ఎన్నికలు వచ్చే సరికి జనసేన ఒంటరిగా బరిలోకి దిగింది. పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీచేసినా ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయారు. జనసేన పార్టీ తరపున ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ఒక్కరే జనసేన పార్టీ తరపున విజయం సాధించి, అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఆయన జనసేన పార్టీని వదిలి అధికార వైసీపీలో చేరడంతో రాష్ట్ర అసెంబ్లీలో జనసేన బలం సున్నాకు పడిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఇటీవల జనసేన పార్టీ తమ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులనుద్దేశించి పవన్ కల్యాణ్.. జూన్ నాలుగో తేదీన ప్రసంగించారు. పొలిటికల్ పొత్తులపై మూడు ఆప్షన్లున్నాయన్నారు. ఒకటి బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసుకోవడం.. రెండోది బీజేపీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేయడం.. మూడోది బీజేపీకి సైతం దూరం జరిగి సింగిల్‌గా ఎన్నికల్లో బరిలోకి దిగడం.. ఇలా మూడు ఆప్షన్లున్నాయని వెల్లడించిన పవన్ కల్యాణ్.. పొత్తుల కోసం త్యాగాలు మాత్రం వుండవని కుండబద్దలు కొట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన త్యాగాలు చేస్తూ వస్తోందని.. ఇకపై త్యాగాలుండవని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి మొన్నటి జనవరి నుంచి జనసేనతో జత కట్టేందుకు టీడీపీ యత్నాలు ప్రారంభించింది. జనవరి 5న కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. జనసేన విషయంలో తమది వన్ సైడ్ లవ్ అన్నారు. ఆ సందర్భంలో స్పందించిన పవన్ కల్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసే బాధ్యత విపక్షాలపై వుందన్నారు. తద్వారా టీడీపీలో పొత్తుకు అవకాశం వుందన్న సంకేతాలిచ్చారు. మళ్ళీ ఇటీవల టీడీపీ, జనసేన పార్టీల పొత్తుపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఓ దశలో టీడీపీతో కలిసేందుకు తాము సిద్దమన్నారు పవన్. కానీ వారం రోజుల్లో పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. బీజేపీతో కలిసి ఎన్నికలు ఎదుర్కొంటామని జనసేన వర్గాలు చెప్పడం మొదలుపెట్టాయి. ఒకవేళ బీజేపీకీ ఓకే అయితే.. టీడీపీని తమ కూటమిలో చేర్చుకుంటామని.. కానీ సీట్ల విషయంలో మాత్రం తమదే తుది నిర్ణయం కావాలని జనసేన వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలో తామే నిర్ణయిస్తామని అంటున్నారు జేఎస్పీ నేతలు. అంటే సీఎం సీటు రావాలంటే తమ కూటమిలో అతిపెద్ద పార్టీగా నిలవాల్సిన అవసరాన్ని జనసేన నేతలు గుర్తించారన్నమాట.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వచ్చిన నేపథ్యంలో మరోసారి బీజేపీ, జేఎస్పీల మధ్య పొత్తుపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. 2014 ఫలితాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటారా బీజేపీ నేతలు..లేక 2019 చేదు అనుభవాలనే పరిగణనలోకి తీసుకుంటారా.. అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయి. 2014లో కలిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయి. ఆనాటి ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. దాంతో ఎన్నికల అనంతరం టీడీపీ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో బీజేపీ పాలు పంచుకున్నది. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు దెబ్బతీస్తుందని అంచనా వేసిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపైనా, బీజేపీ నేతలపైనా విరుచుకుపడడం మొదలు పెట్టారు. బీజేపీతో కలిసి వున్నప్పడు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న చంద్రబాబు. చివరికి అదే అంశం ఆధారంగా నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆఖరుకు చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుదాకా వెళ్ళారు చంద్రబాబు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలో యుపీఏ సర్కార్ ఏర్పాటవుతుందని భావించిన చంద్రబాబు అంచనా ఘోరంగా తప్పింది. దాంతో 2019 ఎన్నికల తర్వాత మళ్ళీ బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు పలు మార్లు విఫలయత్నం చేశారు. మోదీ, అమిత్ షాలను కలిసేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించినప్పటికీ వారిద్దరు అపాయింట్‌మెంటు కూడా ఇవ్వలేదని పలు మీడియా సంస్థలు రాశాయి. ఏది ఏమైనా 2024లోగా వీలైతే బీజేపీ, జనసేన పార్టీలతోను.. బీజేపీ అందుకు ససేమిరా అంటే కనీసం జనసేన పార్టీతో అయినా పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే 2022 జనవరి నుంచి ఇప్పటి దాకా చంద్రబాబు తన అభిలాషను ప్రత్యక్షంగాను, పరోక్షంగా పలుమార్లు వెల్లడించారు కూడా. పవన్ కల్యాణ్ కూడా ఓ దశలో చంద్రబాబుకు దగ్గరవుతున్నట్లు సంకేతాలిచ్చారు. కానీ కారణాలైతేనేం ప్రస్తుతానికి బీజేపీని కాదని టీడీపీతో జత కట్టేందుకు పవన్ సుముఖంగా లేరని తెలుస్తోంది.మెజార్టీ నియోజకవర్గాల్లో జనసేనపార్టీకి విజయావకాశాలను ప్రభావితం చేసే స్థాయిలో ఓటర్లున్నారు. దాంతో వైసీపీని ఓడించాలంటే జనసేన పార్టీతో పొత్తు అవసరమని టీడీపీ వర్గాలు అనుకుంటున్నాయి. చంద్రబాబు పర్యటనకొచ్చినపుడు వివిధ జిల్లాల దేశం శ్రేణులు జనసేనతో పొత్తు అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే జనవరిలో కుప్పానికి వెళ్ళిన చంద్రబాబుకు అలాంటి సందర్భమే ఎదురైతే ఆయన ‘‘ వన్ సైడ్ లవ్’’ అంటూ ఛలోక్తి విసిరారు. టీడీపీతో కల్వడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నప్పటికీ.. మొన్నటి లోకల్ బాడీస్ ఎలెక్షన్లలో పలు చోట్ల టీడీపీ, జనసేన పార్టీతు లోపాయకారీగా కలిసి పని చేసినట్లు కథనాలొచ్చాయి. ఈమధ్యకాలంలో ఒంగోలులో నిర్వహించిన మహానాడు విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఇనుమడించింది. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అంటూ చంద్రబాబు మహానాడులో చేసిన ప్రసంగంతో మరోసారి పొలిటికల్ పొత్తులపై చర్చ మొదలైంది. అయితే.. పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన తర్వాత మాత్రం టీడీపీ వర్గాల నుంచి ఎలాంటి స్పందనా వ్యక్తం కాలేదు. ముఖ్యంగా 2014లో పొత్తు ఉన్నప్పటికీ తాము పోటీ చేయకుండా టీడీపీకి సహకరించామని, ఈసారి టీడీపీ తగ్గాల్సిన అవసరం వుందన్నది జనసేన భావనగా కనిపిస్తోంది. పొలిటికల్ పొత్తులపై జనసేన వర్గాల అభిప్రాయాలపై బీజేపీ నాయకత్వం స్పందించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జేఎస్పీతో కలిసే పోటీకి దిగుతామని బీజేపీ నేతలు ప్రకటించారు. పవన్ కల్యాణే తమ కూటమి సీఎం అభ్యర్థి అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇదివరకే ప్రకటించారు. అయితే.. తననే సీఎం అభ్యర్థిగా బీజేపీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం విశేషం. ఈ చర్చ ఇలా కొనసాగుతున్న తరుణంలోనే జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనకు వచ్చారు. బీజేపీ శక్తి కేంద్రాల ప్రముఖులతో ముందుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీకి 46 వేల పోలింగ్ బూత్ కమిటీలున్నాయన్నారు. అయితే.. రాష్ట్ర బీజేపీ నేతలతో జరిగే మంతనాలలో పొలిటికల్ పొత్తులపై నడ్డా క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వవచ్చని భావిస్తున్నారు. 2019 తర్వాత ఏపీ బీజేపీలో దూకుడు కనిపిస్తోంది. మోదీ చరిష్మా పెరగడం, చంద్రబాబు ప్రాభవం తగ్గినట్లు కనిపించడంతో గత మూడేళ్ళుగా బీజేపీ తమ కార్యకలాపాలను పెంచింది. అయితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక అనేదే ఇపుడు పొత్తులకు ప్రాతిపదికగా కనిపిస్తోంది. కానీ తమను నానారకాలుగా తిట్టిపోసిన చంద్రబాబుతో కలిసేందుకు బీజేపీ నేతలు ఏ మాత్రం ముందుకొస్తారనేది అనుమానమే. ఇక్కడ మరో అంశం కూడా కీలకంగా కనిపిస్తోంది. గతంలో తాము తగ్గామని ఈసారి తగ్గాల్సిన పరిస్థితి టీడీపీదని పవన్ వ్యాఖ్యానించడం వెనుక సీఎం సీటు వ్యూహమే ప్రధానంగా వుందని తెలుస్తోంది. పొత్తు కలిసినా టీడీపీకి తక్కువ, తమకు ఎక్కువ సీట్లు వుండాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. దాంతో తమ కూటమి విజయం సాధిస్తే.. తానే ముఖ్యమంత్రి కావాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నట్లు తేటతెల్లమవుతోంది. సీఎం సీటు విషయంలో చంద్రబాబు కాంప్రమైజ్ అవడం దాదాపు అసాధ్యమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈక్రమంలో 2024 ఎన్నికల్లో త్రిముఖ పోరు అనివార్యమయ్యే అవకాశాలే మెండుగా వున్నాయి. టీడీపీతో కలిసేందుకు బీజేపీ విముఖంగా వుండడం, సీఎం సీటు విషయంలో చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో ఎవరికి వారే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీతోపాటు బీజేపీ-జనసేన కూటమి బరిలోకి దిగితే త్రిముఖ పోరు ఖాయం. ఈ విషయంలో క్లారిటీకి మరికొంత కాలం పట్టొచ్చు.