విజయవాడ, జూన్ 8,
తెలంగాణ బీజేపీపై శ్రద్ధ పెట్టినట్లు ఏపీపై ఆ పార్టీ పెద్దగా ఫోకస్ పెట్టలేదనే అనిపిస్తుంది. జేపీ నడ్డా లాంటి నేతలు వచ్చినా వారు ప్రజలను ఆకట్టుకునేంత స్థాయి నేతలు కాదు. తెలంగాణలో గెలుపునకు అవకాశాలుండటం, అక్కడ పార్టీ రోజురోజుకూ బలోపేతం అవ్వుతుండటంతో మోదీ నుంచి అమిత్ షా వరకూ అక్కడ దష్టి పెట్టారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో స్వయంగా అమిత్ షా పాల్గొనడం, మోదీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సమావేశం కావడం ఇందుకు ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ కు జేపీ నడ్డా వచ్చినా నామమాత్రమే అని చెప్పాలి. ఇక్కడ పార్టీ బలోపేతం అవుతుందన్న నమ్మకం అధినాయకత్వానికి లేదు. ఏపీలో ఓటు బ్యాంకు బీజేపీకి లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పకతప్పదు. రాజ్యసభ స్థానాల్లో సయితం ఏపీలో నేతలను పార్టీ హైకమాండ్ పట్టించుకోలేదు. తెలంగాణలో ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కు యూపీ నుంచి రాజ్యసభ స్థానాన్ని కేటాయించారు. రాజ్యసభ స్థానాలను.... ఎన్నికలు జరగబోయే కర్ణాటక వంటి రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ రాజ్యసభ సభ్యుల ఎంపికలో ఏపీని పార్టీ హైకమాండ్ పూర్తిగా విస్మరించింది. ఇక్కడ సీనియర్ నేతలు ఉన్నప్పటికీ వారి జోలికే పోలేదు. నిజానికి పార్టీని బలోపేతం చేయానికి సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ కి ఈసారి రాజ్యసభ స్థానం దక్కుతుందని భావించారు. పోనీ అదే సామాజికవర్గానికి చెందిన పురంద్రీశ్వరికి అయినా చోటు దక్కుతుందని అనుకున్నారు. కానీ ఏపీలో ఏ నేతకు రాజ్యసభ స్థానం దక్కలేదు ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఏపీలో జనసేనతో పొత్తుతో వచ్చే ఎన్నికలకు వెళతామా? లేదా? అన్నది కూడా హైకమాండ్ కు సందేహంగానే కన్పిస్తుంది. జనసేన చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చినా ఇవ్వవచ్చు. టీడీపీతో కలసి వెళ్లాల్సిన అవసరం లేదన్నది బీజేపీ అగ్రనేతల అభిప్రాయం. మరో వైపు కాంగ్రెస్ కు పూర్తి వ్యతిరేకంగా ఉన్న జగన్ ఎటూ తమకు 2024 ఎన్నికల ఫలితాల తర్వాత మద్దతు ఇచ్చే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ స్థానాలను ఏపీకి కేటాయించి వాటిని వేస్ట్ చేసుకోవడం ఎందుకన్న ధోరణిని హైకమాండ్ ప్రదర్శించినట్లు కనపడుతుంది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డి ఉన్నారు. ఏపీ నుంచి ఒక్కరూ లేరు. అలా ఏపీని బీజేపీ అగ్రనేతలు పక్కన పెట్టేశారనే చెప్పాలి.