YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పాపం... మంత్రిగారు..ఎమ్మెల్యే...

పాపం... మంత్రిగారు..ఎమ్మెల్యే...

కాకినాడ, జూన్ 8,
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ, గత నెల 24న అమలాపురంలో విధ్వంసకాండ జరిగింది. అల్లర్లలో మంత్రి విశ్వరూప్ క్యాంపు కార్యాలయం, ఇల్లు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి నిప్పు అంటించారు ఆందోళనకారులు. ఆ ఘటన రాష్ట్రంలో సంచలనం స్రుష్టించింది. ఏకంగా మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు పెట్టడం సంచలనమైంది. పార్టీ కూడా తీవ్రంగా పరిగణించింది. కానీ అప్పటి నుంచి మంత్రి, ఎమ్మెల్యే ను కనీసం పలకరించేవారే కరువయ్యారు. సంఘటన తర్వాత పార్టీ ప్రభుత్వ పెద్దలు అమలాపురానికి క్యూ కడతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిప్పు అంటించిన ప్రాంతానికి స్వయంగా వచ్చి పరిశీలిస్తారని అందరూ అనుకున్నారట. మంత్రి విశ్వరూప్ సైతం ఇష్యూ జరిగిన తర్వాత రోజు రెండు ప్రాంతాలను పరిశీలించారు. పార్టీ, ప్రభుత్వం నుంచి పెద్ద హోదాలో గల వ్యక్తులు వస్తారని అనుచరులకి సమాచారం ఇచ్చారట. వారి ముందు, జరిగిన ఘటనకు గురించి చెప్పాలని సూచించారట. ఇంకేముంది ఈ విషయం అధిష్ఠానం సీరియస్ గా తీసుకుందన్న ప్రచారం జోరుగా జరిగింది. అమలాపురం అల్లర్లు జరిగినప్పుడే బీసీ మంత్రుల సామాజిక న్యాయ బస్సు యాత్ర జరిగింది. అప్పుడు ఆ బస్సు యాత్ర జిల్లాలోనే ఉంది. మొత్తం మంత్రులు ఇలా అమలాపురం వచ్చి వెళ్తారని క్యాడర్ అనుకున్నారు. కానీ అటువంటిది ఏమి జరగలేదు సరి కదా.. స్వయంగా మంత్రి విశ్వరూప్ ని ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలు రావడంతో అవాక్కయ్యారట. క్యాబినెట్ లో మంత్రిని కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యారని తెగ మధనపడిపోతున్నారట విశ్వరూప్ అనుచరులు.అప్పట్నుంచి క్యాడర్ కు సర్ది చెప్పలేక పోతున్నారట మంత్రి. మీకే ఇలాంటి పరిస్థితులుంటే, ఇక మా లాంటివారి పరిస్థితి ఏంటని గోడు వెళ్ళబోసుకుంటున్నారట. వారిని సముదాయించలేక, సమాధానం చెప్పలేక, నియోజకవర్గానికి రావడం మానేశారట మంత్రి. అయితే హైదరాబాద్ లేదంటే విజయవాడకే పరిమితం అవుతున్నారట. ఇక మంత్రి పరిస్థితి ఇలా ఉంటే, తాను అతిగా ఊహించుకోవడం అత్యాశ అవుతుందని సరి పెట్టుకుంటున్నారట ఎమ్మెల్యే. ఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదట పొన్నాడ సతీష్. పూర్తిగా కాకినాడకే పరిమితం అయ్యారట. ఎవర్నీ కలవడానికి, మాట్లాడ్డానికి ఇష్టపడటం లేదట. కనీసం శాంతి భద్రతల సమస్య కాబట్టి హోంమంత్రి, డీజీపీ వస్తారని అంచనా వేశామని, మరీ ఇలా తీసి పడేశారేంటని అంటున్నారట. అందరూ సపోర్ట్ చేసి ఉంటే, ఇష్యూ సీరియస్ నెస్ మరొక విధంగా ఉండేదని చెప్తున్నారట. ఇప్పుడు అనవసరంగా తాము బ్లేమ్ అవుతున్నామని, బాధ వెళ్లగక్కుతున్నారట. అయినా కోనసీమ జిల్లా పేరుకు సంబంధించి తమకు ఎటువంటి ప్రయోజనాలు ఉండవు కదా అని తమలో తామే మధన పడిపోతున్నారట.ఇంత సున్నితమైన విషయంలో తమను ఏకాకులను చెయ్యడం ఎంతవరకు సమంజసమని గగ్గోలు పెడుతున్నారట. ఇలాంటి చర్యల వల్ల క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెవులు కొరుక్కుంటున్నారట. అసలు తాము చేసిన తప్పేంటో తెలియాలి కదా అని, తనను కలిసిన ఎంపీ బోస్ దగ్గర బాధను వెళ్లబోసుకున్నారట ఇరువురు నేతలు. పార్టీ కోసం ఎంతో చేశామని, పార్టీ కూడా తమకు ఎంతో ఇచ్చిందని, అది కాదనమని, కానీ ఇలా వ్యవహరించడం సరికాదని వాపోతున్నారట. ఈ ఘటనలో జరిగిన నష్టం కంటే అసలు తమను పిలిచి మాట్లాడి వివరణ అడగలేదనే బాధే వారిలో ఎక్కువగా కనిపిస్తోందట.మొత్తానికి విధ్వంసానికి పరామర్శ లేదని ఆ ఇరువురు నేతలు తెగ మధన పడిపోతున్నారు. ఈరోజు తమకు జరిగింది..రేపు ఎవరికైనా జరగవచ్చని.. దానికి ఒక సిస్టం అంటూ ఉండాలి కదా అని అంటున్నారు. అధిష్టానం సంగతి అటుంచితే కనీసం జిల్లాకు చెందిన మంత్రులు కూడా అమలాపురం వైపు తొంగి చూడకపోవడం బాధిత మంత్రి, ఎమ్మెల్యేను విస్మయానికి గురి చేస్తోందట.

Related Posts