తిరుపతి, జూన్ 8,
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకు వైసీపీ పేరుతో ఇంటింటికీ తిరుగుతున్నారు. వైసీపీ మూడేళ్ల పాలన పూర్తి కావడం, ఇక రెండేళ్లు వుండటం, రెండేళ్లలో ఒక ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో, హరీబరీగా తిరుగుతున్నారట. ఇక నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజల మధ్యలో ఉండాలని అధిష్టానం ఆదేశించింది. గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చింది. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఎంతెంత ఇచ్చింది…పథకాల గురించి ప్రచారం చేయాలని ఆదేశించింది. అంతవరకూ బాగానే ఉంది కానీ, ప్రజల నుంచి ఎమ్మెల్యేలకు, అక్కడక్కడా నిలదీతలు ఎదురౌతున్నాయి. ఇన్నాళ్లు ఏసీ కారులు,గదుల్లో ఉండి..అప్పుడపుడు జనం మధ్యకు వచ్చే వైసీపీ నేతలకు, గడపగడప కార్యక్రమం ముచ్చెమటలు పట్టిస్తోందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగానే సాగుతోంది.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి తొలిరోజే చాలా చోట్లా నిరసనల సెగ తగిలింది. ప్రజల ఇళ్లకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు సమస్యలు స్వాగతం పలికాయి. కొన్నిచోట్ల చేదు అనుభవాలూ ఎదురయ్యాయి.ఈ మూడేండ్లలో ఏం చేశారని పలువురు నేతల్ని ముఖం మీదే నిలదీశారు. ఏండ్లు గడుస్తున్నా తమ కష్టాలకు పరిష్కారాలు చూపడంలేదనీ, అర్హతలున్నా సంక్షేమ పథకాలు అందడంలేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉమ్మడి చిత్తూరులో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు రెండు, మూడు ఇళ్లకే పరిమితమయ్యారని సమాచారం . ముఖ్యంగా చిత్తూరు, మదనపల్లె, సత్యవేడు, జీడి నెల్లూరు, పూతలపట్టు, నగరి,పుంగనూరులో ఈ పరిస్థితి ఎక్కువ ఉందట. నగరి నియోజకవర్గంలోని టీసీ అగ్రహారం, కల్లూరు గ్రామ సచివాలయాల పరిధిలో పర్యటించిన మంత్రి రోజాపై, స్థానికులు కరెంట్ చార్జీల పెరుగుదలపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఇక్కడే కాదు దేశం మొత్తం పెరిగాయంటూ సైలెంట్ గా సైడ్ అయిపోయారు రోజా .పుంగనూరులో సోమల, రొంపిచెర్ల క్రాస్‌లో పర్యటించారు మంత్రి పెద్దిరెడ్డి. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారితోనే మంత్రి ఎదుట మాట్లాడించేందుకు స్థానిక నాయకులు తంటాలు పడ్డారట. నిరసన తెలుపుతారనే భయంతో ప్రభుత్వ పథకాలు అందనివారిని, మంత్రి ఎదుటకు రాకుండా చూసుకునేందుకు అష్టకష్టాలు పడ్డారట. జీడి నెల్లూరు రామాపురంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి స్థానికుల సెగ తగిలింది. జనం ముందు ప్రశ్నలు ఎదుర్కోవడం ఒకటైతే, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నేతలు అల్లాడిపోతున్నారు. దీంతో సెగ తగిలిన ఎమ్మెల్యేలు రూట్ మారిస్తే, సెగ తగలకుండా ఉండేందుకు మరికొందరు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నరనే టాక్ సాగుతోంది.అందులో భాగంగానే మంత్రులు, ఎమ్మెల్యేల కంటే ముందుగానే, ఆయా కాలనీలకు వెళ్తున్నారట డ్వాక్రా లీడర్లు, వాలంటీర్లు. మేం చెప్పినట్టే, సార్ వద్ద చెప్పాలి, వేరే ఏం మాట్లాడు కూడదంటూ ట్రైనింగ్ ఇస్తున్నారట. మరికొందరైతే, పలమనేరు ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చినట్లు, ఎక్కడైనా మాకాలనీకి ,ఇంటికి రావద్దు అంటూ బేనర్లు కట్టారేమోనని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని, అంతా క్లియరెన్స్ వచ్చాకే గడప గడపకు వెళుతున్నారట. అలా ప్లాన్ చేసే వారిలో డిప్యూటీ సీఎం, మంత్రి రోజాలు ముందున్నారనే టాక్ ఇప్పుడు జిల్లాలలోనే కాకుండా సోషల్ మీడియాలోను హాట్ టాపిక్ గా మారిందట.ఇక డిప్యూటీ సీఎం నారాయణకి అయితే, హారతీ ఇవ్వకపోతే ఫైన్ వేస్తారనే చెప్పే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా అన్నీ పక్కాగా సెట్ చేసుకుని వెళ్ళినా, అప్పుడప్పుడు, అక్కడక్కడా నిరసన సెగ తగులుతోందని నేతలు తలలు పట్టుకుంటున్నారట. అన్ని నియోజకవర్గాల్లో అన్నీ బాగున్నాయని, మా పనితీరు బాగుంటుందని చెప్పుకోవడానికి నేతలు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారివారి అనుచరులు మాట్లాడుకుంటున్నారట. ఏమాత్రం చిన్న ఇష్యూ అయినా ప్రతిపక్షాలు ఉతికేయడానికి రెడీ ఉన్న నేపథ్యంలో, ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం తప్పేమీ కాదని అధికార పార్టీ నేతలు, ఎవరికి వారే బహిరంగంగా సర్దిచెప్పుకుంటున్నారట. మొత్తమ్మీద అధిష్ఠానం ఇచ్చిన టాస్క్ పూర్తి చేయడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారట చిత్తూరు జిల్లా నేతలు.