విజయవాడ, జూన్ 8,
పవన్ కామెంట్లు టీడీపీని డిఫెన్సులో పడేసినట్టే కన్పిస్తోంది. పార్టీ ఆవిర్భావ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడతాననే పవన్ కామెంట్లతో, తమతో కలిసి పని చేయడానికి సంసిద్దతను పవన్ తన కామెంట్ల ద్వారా తెలిపారని జనమంతా భావించారు. అదే తరహాలో టీడీపీ కూడా అనుకుంది. ఆ తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో కూడా పవన్ ఇదే తరహాలో మాట్లాడితే పొత్తు పక్కా అని తమ్ముళ్లూ ఫిక్స్ అయినట్టే కన్పించారు. చంద్రబాబు ఏం కోరుకుంటున్నారో, దానికి అనుగుణంగానే పవన్ స్పందించారు కాబట్టి.. పొత్తులపై స్పష్టత వచ్చేసినట్టేనని అనుకున్నారు. అయితే జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు, టీడీపీ షాక్ గురయ్యేలా చేశాయనే చెప్పాలి. ఇన్నాళ్లూ తాము తగ్గామని.. ఇకపై తాము తగ్గేదే లేదని చెప్పడమే కాకుండా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ తగ్గితే బాగుంటుందని పవన్ అనడంతో టీడీపీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. పవన్ అలా ఎందుకన్నారు? అసలేం జరుగుతుందో అనేది టీడీపీకి అర్థం కావడం లేదట.ఇప్పుడు దీనిపై విశ్లేషించుకునే పనిలో పడ్డాయి టీడీపీ వర్గాలు. అసలు పవన్ ఈ తరహా కామెంట్లు ఎందుకు చేశారన్న దానిపై ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారట తమ్ముళ్లు. ఇటీవల కాలంలో చంద్రబాబు చేసిన కామెంటే పవన్ తాజా సంచలనానికి కారణం అనే చర్చ, ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తును కోరుకుంటున్నామనే సంకేతం ఇస్తూ, మనది వన్ సైడ్ లవ్ అనే కామెంట్ చేశారు. ఇక ఇటీవలి కాలంలో జరిగిన మహానాడు సక్సెస్ తర్వాత ప్రభుత్వాన్ని, వైసీపీని ఉద్దేశించి వార్ వన్ సైడ్ అనే కామెంట్ చేశారు బాబు. ఇప్పుడీ కామెంటే పవన్ తగ్గేదేలే కామెంటుకు కారణంగా కన్పిస్తోందనే చర్చ జరుగుతోంది. వార్ వన్ సైడ్ అంటే తమను కూడా పట్టించుకోకుండా, ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు చెప్పారనేది జనసేనలో జరుగుతోన్న చర్చ. తమ అవసరం లేదనే రీతిలో చంద్రబాబు.. టీడీపీ వ్యవహరిస్తున్నప్పుడు, తామేమీ టీడీపీ వెంట పడడం లేదనే విషయాన్ని టీడీపీకి అర్థమయ్యేలా చెప్పడంతో పాటు, ఆ పార్టీకి ఓ ఝలక్ ఇవ్వడానికే పవన్ ఈ తరహా కామెంట్ చేశారా అనే చర్చ టీడీపీలో జరుగుతోందట.చంద్రబాబు వార్ వన్ సైడ్ కామెంట్ పవన్ ఉద్దేశించి కాదని అంటున్నారు కొందరు తమ్ముళ్లు. ఇదే సందర్భంలో పవన్ కామెంట్లపై వీలైనంత వరకు మౌనం పాటిస్తేనే మంచిదని అంటున్నారు. మహానాడు తర్వాత ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా, గెలుస్తామనే ధీమా చాలామంది కార్యకర్తల్లో ఉన్నా, నేతల్లో కాన్ఫిడెన్స్ కన్పించినా.. రిస్క్ తీసుకోకూడదనేది చాలామంది టీడీపీ నేతల భావన. పైగా ఎన్నికలకు మరో రెండేళ్లు టైమ్ ఉండడంతో, ఏం జరిగినా జరగొచ్చనే భావన కూడా ఉంది. దీంతో పవన్ విషయంలో వీలైనంత వరకు సంయమనం పాటిస్తే మంచిదనే చర్చ పార్టీలో సాగుతోంది. ఈ క్రమంలోనే పవన్ కామెంట్ల విషయంలో టీడీపీ నుంచి పెద్దగా స్పందనల్లేవు.ప్రభుత్వ వ్యతిరేకత వున్నా, అది ఎంత వరకు కలిసి వస్తుందన్న డౌట్ టీడీపీ వర్గాల్లో వుంది. 2014లో పవన్ కాంబినేషన్ కలిసి వచ్చింది. ఇప్పుడు అదే కలిసి వచ్చే అవకాశం వుందని కొందరి అంచనా. పొత్తుల లెక్క వేరు, ఇప్పుడు పవన్ పెడుతున్న ఆప్షన్లు, షరతులు వేరు. టీడీపీ తగ్గడం అంటే తనను సీఎం చెయ్యడం అనేది పవన్ మాటలకు అర్థమని కొందరు టీడీపీ నేతలంటున్నారు. అదే నిజమైతే, పొత్తుల సమస్యను పరిష్కరించడం టీడీపీకి సమస్యే. అందుకే వీలైనంత వరకు కొన్నాళ్లు మౌనంగా వుండటమే మేలని టీడీపీ భావిస్తోంది.