YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజమండ్రి సీటుపై జయప్రద గురి

రాజమండ్రి సీటుపై జయప్రద గురి

రాజమండ్రి, జూన్ 8,
బీజెపి సీనియర్ రాజకీయ నాయకురాలు, సినీనటి జయప్రద తెలుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా..? తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై తాను ఆసక్తితో ఉన్నట్టు సినీ నటి జయప్రద ఇప్పటికే చాలా సార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు రాజమండ్రీలో జరిగిన బహిరంగ సభలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి నా స్వస్థలం.. ఇక్కడి నుంచే దేశ రాజకీయాల్లోకి వెళ్లాను. మన ఊరు, మనవాళ్లను వదిలి వెళ్లినందుకు క్షమించండి అంటూ తెలుగు ప్రజలను కోరారు. ఇక తాను తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలనుకుంటున్నట్లు తన మనసులోని మాట చెప్పారు. అయితే ఆమె ఏపీ రాజకీయాలవైపే ప్రధానంగా ఆసక్తితో ఉన్నట్టు సమాచారం. సినీరంగంలో ఓ వెలుగు వెలిగిన జయప్రద ఆ తర్వాత రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. తెలుగింటి ఆడబిడ్డగా మొదలుపెట్టిన ప్రస్థానం జాతీయస్థాయిలోనూ చాటగలిగింది. తెలుగుదేశంతో ప్రారంభమైన ఆమె మనుగడ.. ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడి 2019లో బీజేపీలో చేరిన జయప్రద.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పార్టీ క్యాడర్‌లో ఉన్నందున తెలంగాణా లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరే విషయంలో పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లోకి రావడానికి తనను అనుమతించాలని బీజేపీ అధిష్టానాన్ని అభ్యర్థిస్తానని నటి జయప్రద గతంలో ఒకసారి చెప్పిన సంగతి తెలిసిందే.ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన జయప్రద తన గత 28 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పార్టీలు మారారు. 1994లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టిఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ లో చేరడం ద్వారా ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీ పగ్గాలను చంద్రబాబు చేతిలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు 1996లో జయప్రదను రాజ్యసభ సభ్యురాలిగా.. పార్టీ మహిళా విభాగం నాయకురాలిగా నియమించారు. చంద్రబాబు మరో నటి రోజాను మహిళా విభాగం చీఫ్‌గా చేయడంతో వారి మధ్య విభేదాలు రావడంతో బయట వెళ్లినట్లుగా రాజకీయాల్లో ప్రచారంలో ఉంది.ఆ తర్వాత అమర్ సింగ్, ములాయం సింగ్ ఆహ్వానం మేరకు ఆమె సమాజ్ వాదీ పార్టీ లో చేరారు. ఆమె 2004లో రాంపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మళ్ళీ 2009లో తిరిగి ఎన్నికయ్యారు. ములాయం సింగ్‌పై తిరుగుబాటు చేసిన తర్వాత జయప్రద అమర్ సింగ్ పక్షాన నిలిచారు. 2010లో ఎస్పీ నుంచి బహిష్కరించబడిన జయప్రద.. అమర్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మంచ్‌లో చేరారు. అయితే, ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత 2014లో అమర్ సింగ్‌తో పాటు జయప్రద అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (RLD)లో చేరారు. జయప్రద ఆర్ ఎల్ డి అభ్యర్థిగా బిజ్నోర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసినప్పటికీ నాల్గవ స్థానంలో నిలిచింది.అయితే, 2019 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆమె బీజేపీలో చేరారు. 1998, 1999లో బీజేపీ గెలిచిన రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపవచ్చని ఊహాగానాలు వినిపించాయి. అయితే బిజెపి ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసేందుకు జయప్రద ఆసక్తి చూపుతున్నట్లు ఆమె తాజా వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

Related Posts