రాజమండ్రి, జూన్ 9,
ఎవరో వస్తారని ఏదో చేస్తారని... అదేదో సినిమాలో పాట! అవును మనిషి ఆశలు అడియాశలయినపుడు మనిషి స్థితి అది. కానీ బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా వస్తే మహాద్భుతమే జరుగుతుందనుకున్నారు ఆంధ్రా ప్రాంత బిజెపి నాయకులు, కార్యకర్తలు. తీరా రాజు వచ్చి వెడలె అయింది. పార్టీ పరువు బుడగ గాలి తీసేసేరు. అంతకుముందు వరకూ ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుల ప్రవచనాలకు, నడ్డా ప్రవచనానికి బొత్తిగా పొంతనే లేదు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని విధాలా అందరూ బాగా కష్టపడాలని ఉద్భోధచేయడం ఎవరికయినా పరిపాటి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ పథకాలను బాగా ప్రచారం చేస్తూనే మరోవంక అధి కార పక్షాన్ని, ఇక్కడ పాలనా విధానాన్ని చీల్చిఛండాడాలని బిజెపి నాయకులు, కార్యక ర్తలూ అందుకు గట్టిగా పూనుకోవాలని గతంలో రాష్ట్రానికి వచ్చిన ఉత్తరాది బిజెపి నాయకులంతా చెప్పి వెళ్లేరు. అది పార్టీ వర్గాలను నిజంగానే ఉత్సాహపరిచింది.ఇపుడు నడ్డా రాకతో మరింత అద్భుతాలు జరుగుతాయి అని అంతా ఆశించేరు. కానీ అందుకు పూర్తి విరుద్ధమే జరిగింది. ఇది పూర్తిగా ఎవ్వరూ వూహించనిది. ఎన్నికలకు ఇంకా బోలెడు సమయం వుందిగనుక పొత్తుల సంగతి వదిలేసి జగన్ ప్రభుత్వ విధానాలు, కేంద్రపథకాల అమలులో జరుతుగున్న అవకతవకలను ఎత్తిచూపడంలో మనసు పెట్టమని నడ్డా సూచిం చేరు. బిజెపికి కాస్తంత సన్నిహితంగా వున్న జగన్ విషయంలో ఈ విధంగా ఆయన సూచనలు ఇవ్వడమే ఇక్కడి బిజెపి వర్గాలను కంగారుపెట్టింది. పైగా చూచాయిగా తెలుగుదేశం పార్టీ, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలోనూ ఆచీతూచీ వ్యవహరించాలని, ఇష్టారీతిగా విమర్శలు, కామెంట్లు విసరవద్దని అన్యాపదేశంగా చెప్పడం బిజె పి ప్రాంతీయ నాయకులను కాస్తంత ఇబ్బంది పెడుతోంది.నడ్డా నుంచి ఈ విధమైన సూచనలు సలహా లు అన్యాపదేశంగానైనా రావడం టిడిపి పట్ల రవ్వంత ప్రేమను తెలియజేయడమేనా? మొత్తానికి నడ్డా హెచ్చరికలు ఇక్కడి నాయకులకు ఏమాత్రమూ మింగుడు పడటం లేదు. రాజమహేంద్రవరం జరిగిన సమావేశంలో నడ్డా ఎంతో భావోద్వేగ ఉపన్యాసంతో బిజెపి కార్యకర్తలను ఉత్సా హపరిచి రాబోయే యుద్ధానికి సిద్ధపరిచేందుకు మార్గాలు సూచిస్తారనుకున్నారు అంతా. కానీ జరిగినది అందుకు పూర్తి విరుద్ధంగా ప్రసంగించడంతో వచ్చిన జనం బాగా విసిగెత్తేరు.అసలు వచ్చిన జనమే అంతంగా, సభ కోసం వేసిన కుర్చీలు మూడోంతులు ఖాళీగానే దర్శన మించ్చాయి. ఇక రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న జనసేన గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పక పోవడంతో బీజేపీ రాష్ట్ర నాయకులలో కొత్త సందేహాలు మొలకెత్తడానికి దోహదపడిందే తప్ప ఇక్కడి కేడర్ లో సమరోత్సాహాన్ని ఇసుమంతైనా నింప లేదు. అసలే ఏపీలో బీజేపీకి ఉన్న కేడర్ అంతంత మాత్రం నడ్డా వారి పర్యటన, ప్రసంగాలతో ఆ క్యాడర్ కూడా జారిపోయే ప్రమాదం ఉందని ఇక్కడి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలో నడ్డా సభానంతరం పిచ్చాపాటిలో ముచ్చటించుకోవడం కనిపించింది