నెల్లూరు , జూన్ 9,
రాజకీయాల్లో గెలవడం, ఓడడం కంటే లోపాయికారి ఒప్పందాలు, ఒకరికొకరు తోడ్పడడాలు చాలా చిత్రంగా జరిగిపోతూంటాయి. తమకు గెలిచే అవకాశాలు మెండుగా వున్నప్పటికీ భారీ మెజారిటీ కోసం భారీ జాగ్రత్తలు తీసుకోవడం కొంచెం ఓవరాక్షన్‌లానే అనిపిస్తుంది. ఆత్మకూరు విషయంలో వైసీపీ సంగతి అలానే వుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గౌతం రెడ్డి చనిపోవడంతో ఆత్మకూరు సీటుకి ఉప ఎన్నిక జరుగ నుంది. మంచి నేత, మంత్రి చనిపోయిన పుడు ఆయన కుటుంబీకులకో, సమీపబంధువులకో ఆ స్థానంలో పోటీకి ఛాన్స్ ఇవ్వడం, వారు గెలిచేలా మద్దతు నీయడం దాదాపు అన్ని పార్టీలవారూ అందుకు ఆమోద ముద్రవేయడం సర్వ సాధారణం. ఆత్మకూరులో పరిస్థితీ అంతే. ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ ఎలాగూ గెలుస్తుందనేది అందరూ అనుకుంటున్నదే. దీనికి పెద్దగా పోటీచేయాల్సిన పనిలేదనే అనుకున్నారు. కానీ హఠాత్తుగా బిజెపీ తన అభ్యర్ధిని పోటీకి దింపేందుకు సిద్ధ పడింది. అంటే వైసీపీకి వీలయితే ఆ భారీ మెజారిటీ అందించాలని బిజెపీ కూడా తలుస్తున్నదనే అనుకోవాలి. గత ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నికల్లో పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నది వైసీపీ లక్ష్యం. అందుకు శాయశక్తులా లోకల్ నాయకులు, పార్టీ వర్గాలవారు కృషిచేయాలని జగన్ ఆదేశం. సానుభూతి ఓటుతో గెల వడం కంటే అందరి కృషితో భారీ మెజారిటీ సాధించి గెలవడం పార్టీ ప్రతిష్టను పెంచుతుం దని జగన్ అభి ప్రాయం కావచ్చు. ఇప్పటికే మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, రోజాలకు ఆ బాధ్యత అప్పగించారు. వీరేగాదు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పంచాయితీ స్థాయి వారిని రంగంలోకి దింపేరు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి పెద్ద మెజారిటీ వచ్చేలా ఓటర్లను పట్టేసుకోమని అధినేత హెచ్చరిక. ఈ సంగతి తెలిసిన ప్రాంతీయులు తెగ నవ్వుకుంటున్నారు. గెలిచే అవకాశాలు ఉన్న చోట ఇంత ఓవరాక్షన్ అవ సరమా అనుకుంటున్నారు. చెట్ల కింద సరదా కబుర్లకు కూడా ఇదో కంటెంట్‌గా మారిపోయింది. అందరికీ సరదా కాలక్షేపం కధే. కానీ వైసీపీ వారికి మాత్రం ఎక్కడ వోటర్లు ఇంట్లోనే వుండిపోతారోనన్న భయాందోళ నతో మంత్రులను రంగంలోకి దింపడం తప్పనిసరి అయిందేమో! ఓట్లు పెంచుకోవడానికి ఇంత కట్టడి అవసరమా జగన్నాధా!