YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీచర్ల కొరతే ఫలితాలపై పడ్డాయా..

టీచర్ల కొరతే ఫలితాలపై పడ్డాయా..

తిరుపతి, జూన్ 9,
స్కూళ్లలో పాఠాలు చెప్పనివ్వకుండా మరుగుదొడ్లు ఫోటోలు తీసే పనికి టీచర్లను పెడితే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఉపాధ్యాయులను సారా దుకాణాల వద్ద కాపలాకి పంపిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. టీచర్లను మానసికంగా వేధిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. పాఠాలు బోధించేవారు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసేలా సర్కార్ నియంతృత్వంగా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది.స్కూళ్లలో దామాషా ప్రకారం మాస్టార్లను నియమించకపోతే ఫలితాలు ఎలా వస్తాయి? పైసలిస్తే ఫలితాలు రావు. మౌలిక సదుపాయాలు ఇచ్చినంత మాత్రాన ఫలితాలు మెరుగు పడవుప్రాథమిక విద్యలో ప్రతి సబ్జెక్ట్ కి ఒక టీచర్ ని వేయండి ఫలితాలు ఎందుకు రావో చూద్దాం. హైస్కూళ్లలో పూర్తి స్థాయిలో టీచర్లను నియమిస్తే ఫలితాలు ఎందుకు రావో చూద్దాం. ఇకనైనా మారండి. మమ్మల్ని స్వేచ్ఛగా పనిచేయనివ్వండి’ ఏపీలోని ఓ సగటు ఉపాధ్యాయుడు ఆవేదనతో అన్న మాటలివి. ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సుమారు రెండు లక్షల మంది ఫెయిలవడం, పాస్ శాతం 67.26 శాతానికి పడిపోవడం, 71 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాని సందర్భంలో ఆ సగటు టీచర్ లో పెల్లుబుకిన ఆవేదన ఇది.ఈ ఏడాది టెన్త్ పాస్ శాతం దారుణంగా తగ్గిపోవడానికి కరోనా కారణమని కొందరు, ప్రభుత్వ వైఫల్యమే అని మరికొందరు, ప్రశ్నాపత్రాలు లీకవడం అని ఇంకొందరు, విద్యా వ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోకపోవడమూ కారణమే అని కొందరు, స్కూళ్లలో టీచర్లే లేపోవడం అని ఇంకొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.  అధికార, విపక్షాలైతే బ్లేమ్ గేమ్ కు దిగారు.  కరోనా వల్ల రెండేళ్లు పరీక్షలు లేకపోవడం, ప్రత్యక్ష తరగతులకు అవకాశం లేక విద్యార్థులకు  ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించడం, నారాయణ విద్యాసంస్థలో ప్రశ్నాపత్రాలు ముందే లీకవడం లాంటి కారణాలను వైసీపీ సర్కార్ సాకుగా చూపిస్తోంది.  ఈ సారి పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు కరోనా వల్ల వారి 8 ,9 తరగతుల్లో పరీక్షలు నిర్వహించలేదని, అప్పుడు వారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ప్రమోట్ చేయడం కారణమే అని చెబుతోంది. ఆన్ లైన్ క్లాసులు విన్నట్లు కొందరు విద్యార్థులు నటిస్తూ, ఫోన్ లలో ఇతర వీడియోలు చూడడం వల్లే ఉత్తీర్ణత తగ్గడానికి కారణం అని చెప్పుకొస్తోంది.నాడు- నేడు నెపంతో వైసీపీ సర్కార్ మూడేళ్లుగా ఆర్భాటపు ప్రచారం చేసుకుందని, తమ హయాంలో 90 నుంచి 95 శాతం వరకు టెన్త్ పరీక్షా ఫలితాలు రాబట్టామని.. వైసీపీ సర్కార్, జగన్ రెడ్డి తీరుతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ రెడ్డి సర్కార్ అస్తవ్యస్థ విధానాల వల్లే 2 లక్షల మంది విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం కోల్పోయే దుస్థితి వచ్చిందని నిప్పులు చెరిగారు. పరీక్షల్లో ఫెయిల్ అయింది విద్యార్థులు కాదని, ప్రభుత్వ వ్యవస్థలే అనేది ఆయన ఆరోపణ.విద్యా వ్యవస్థను వైసీపీ సర్కార్ సర్వనాశనం చేసిందని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. టెన్త్ ఫలితాలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. ‘ఇది పదో తరగతి విద్యార్థుల ఫెయిల్యూర్ కాదు.. జగన్ రెడ్డి సర్కార్ ఫెయిల్యూర్’ అంటూ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఫెయిల్ చేయడం ద్వారా అమ్మ ఒడి, సంక్షేమ పథకాలకు విద్యార్థులను దూరం చేసే కుట్ర జరిగిందని ఆయన ఆరోపణ. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహించిన టెన్త్ పరీక్షల్లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ తో ఆభాసు పాలైందని విమర్శించారు. నాడు- నేడు పేరుతో 3 వేల 500 కోట్లు మింగేసిన వైసీపీ సర్కార్, డీఎస్సీ నిర్వహించలేదని, టీచర్లను నియమించలేదని, అందుకే పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఫెయిలయ్యారన్నారు. అందుకు ‘నారాయణ’ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారమే కారణం అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ వేయడం గమనార్హం. చదువు‘కొన్న’వాడివి నువ్వు రిజల్ట్స్ గురించి మాట్లాడడమేంటని వ్యక్తిగత విమర్శలకు దిగడంపై విమర్శలు వస్తున్నాయి.ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కూడా రంగంలోకి వచ్చి.. ‘చదువంటే ఇసుక తోడడం కాదు. భవిష్యత్తుకు పెట్టుబడి.. పాఠశాల గోడలకు రంగువేయడం, పుస్తకాలు పంపిణీ చేయడం కాదు’ అంటూ జగన్ సర్కార్ ను ఎద్దేవా చేశారు. 71 స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణతా శాతాన్ని చూసి సీఎం జగన్ సిగ్గుతో తలదించుకోవాలని తూర్పారపట్టారు. భారీ సంఖ్యలో టెన్త్ విద్యార్థులు పెయిలవడానికి జగన్ సర్కార్ వైఫల్యమే కారణమని టీడీపీ నేత కొల్లు రవీంద్ర నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమ్మ ఒడి భారం తగ్గించుకునేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నించిందనే అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో 97 శాతం ఉత్తీర్ణత వస్తే.. వైసీపీ పాలనలో 67 శాతానికి పడిపోవడంపై ధూళిపాళ్ల నరేంద్ర నిప్పులు చెరిగారు. ప్రకటించిన దానికన్నా రెండు రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఏపీలో 20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే విద్యా ప్రమాణాలు ఎలా మెరుగవుతాయని నిందించారు. ఇంగ్లీష్ మీడియంపై మోజుతో మాతృభాషను జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేయడంవల్ల కూడా విద్యార్థులకు భారీ నష్టం కలిగిందని విశ్లేషించారు.ఇక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకు వచ్చారు. గతంలో కార్పొరేట్ సంస్థల అక్రమాలతో ఎక్కువ ఫలితాలు వచ్చేవని సెలవిచ్చారు. పరీక్షా ఫలితాలపై కోవిడ్ ప్రభావం పడిందట. ఉత్తీర్ణతా శాతం తగ్గడాన్ని విపక్షాలు వేలెత్తి చూపించకూడదంటున్నారు. దీన్ని విపక్షాలు అస్త్రంగా వాడుకుంటున్నాయని ఉపన్యాసం ఇచ్చారు. పైగా టెన్త్ ఫలితాలపై విపక్షాలు తలకాయ లేకుండా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. అసలు టీడీపీ హయాంలో మాదిరిగా పరీక్షల్లో అక్రమాలు జరగకుండా తమ ప్రభుత్వం అడ్డుకుందని, అందుకే ఉత్తీర్ణతా శాతం తగ్గిందని విశ్లేషించారు. కాపీ కొట్టేందుకు వీలుండే బిట్ పేపర్ తీసేయడం కూడా పాస్ శాతం తగ్గడానికి ఒక కారణం అంటున్నారు. అంటే నిఖార్సయిన వారు, నిజాయితిగా పరీక్షలు రాసిన వారే పాస్ అవడం తమ విజయం అని చెప్పుకొచ్చారు.పరీక్ష ఫెయిలైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదనలో మునిగిపోతే.. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వారి భవిష్యత్తును మెరుగు పరిచేందుకు ఏం చేయాలో, ఎలా చక్కదిద్దాలొ ఆలోచించకుండా అధికార, విపక్షాల నేతలు ఇలా బ్లేమ్ గేమ్ ఆడుతుండడంపై విమర్శలు వస్తున్నాయి.

Related Posts