విజయవాడ. జూన్ 9,
ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై బుధవారం నాడు సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలకు ఎదురైన అనుభవాలు, ప్రజలు ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు, కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడం ఎలా అన్న అంశాలపై చర్చించేందుకే సీఎం జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ వర్క్ షాప్‌లో ఎమ్మెల్యేలకు సీఎం జగన్ షాకిచ్చారు. ఎమ్మెల్యేల పని తీరుపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎవరెవరు ఎన్ని రోజులు గడప గడపకు వెళ్ళారో గణాంకాల రిపోర్టును సీఎం జగన్ బహిర్గతం చేశారు. ఈ నివేదికలో జీరో పెర్ఫార్మెన్స్‌లో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. గడప గడపకు కార్యక్రమానికి స్వయంగా వెళ్ళకుండా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రతినిధులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు జగన్ దృష్టికి వచ్చింది. దీంతో అందరూ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని జగన్ స్పష్టం చేశారు. గడప గడపకు కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. పని తీరు మెరుగు పరుచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. గడప గడపను టచ్ చేయటంలో చీఫ్ విప్ ప్రసాదరాజు మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. జీరో పెర్ఫార్మెన్స్‌లో ఆళ్ల నాని, వసంత కృష్ణప్రసాద్, శిల్పా చక్రపాణిరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఉన్నారని సమాచారం. అయితే ఏపీలో ఇప్పటికే 90 శాతానికి పైగా మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చామని.. 100 శాతం చేయడటం ఎవరికీ సాధ్యం కాదని సీఎం జగన్ అన్నారు. చేయలేక పోయిన అంశాలను ఎందుకు చేయలేకపోయామో ప్రజలకు వివరించాలని వైసీపీ నేతలకు జగన్ సూచించారు.