కడప, జూన్ 9,
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి (49) అనుమానాస్పద రీతిలో మృతిచెందాడం కలకలం రేపింది. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి గంగాధర్ రెడ్డి మృతిచెందారు. నిద్రపోయిన అనంతరం గంగాధర్‌రెడ్డి (gangadhar reddy) మృతి చెందినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటినా అక్కడి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతోపాటు క్లూస్‌టీమ్‌ను కూడా రప్పించి పలు వివరాలు సేకరించారు. అనంతరం గంగాధర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొద్దిరోజులుగా పులివెందులలోనే మకాం వేసిన సీబీఐ అధికారులు.. వైఎస్ వివేకా కేసులో దర్యాప్తులో వేగం పెంచారు. పులివెందుల మొత్తం కలియదిరుగుతూ ఎంక్వైరీ చేస్తున్నారు. వైఎస్ వివేకా ఇంటితోపాటు నిందితుల ఇళ్లను పదేపదే పరిశీలిస్తున్నారు. వైఎస్ వివేకా వ్యక్తిగత సహాయకుడు ఇనయతుల్లాతోపాటు రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో చర్చించారు. ఆ తర్వాత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్, వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి ఇల్లు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇళ్ల ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. వైఎస్ వివేకా మర్డర్ జరిగిన తీరుపై సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఇప్పటివరకు దర్యాప్తులో తేలిన సమాచారం మేరకు ఆయా ప్రాంతాల్లో వీడియో రికార్డింగ్ చేశారు.అలాగే, కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఫొటోలు కూడా తీసుకున్నారు సీబీఐ అధికారులు. అసలు, వైఎస్ వివేకా మర్డర్ ఎలా జరిగింది? నిందితులు ఏ రూట్‌లో వచ్చారు? మర్డర్ చేశాక నిందితులు ఎటువైపు వెళ్లారు? ఇలా సీన్ టు సీన్ అన్నింటిపైనా రీకన్‌స్ట్రక్షన్ చేశారు సీబీఐ అధికారులు. పులివెందుల మొత్తం తిరుగుతూ సీబీఐ టీమ్ చేసిన ఈ ఆపరేషన్‌లో రెవెన్యూ ఉద్యోగులు, వీఆర్వో, సర్వేయర్లు పాల్గొన్నారు. నిందితుల ఇళ్ల పరిశీలించి, కొలతలు తీసుకున్నారు. వైఎస్ వివేకా వ్యక్తిగత సహాయకుడు ఇనయతుల్లాను ఐదు రోజులుగా వెంట తిప్పుకుంటోన్న సీబీఐ అధికారులు… కేసును తిరగదోడుతూ విచారణ జరుపుతున్నారు.
వైఎస్ వివేకా మర్డర్ జరిగిన రోజు, బెడ్రూమ్ అండ్ బాత్రూమ్‌లో ఫొటోలు, వీడియోలు తీసింది ఇనయతుల్లానే కావడంతో, అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. వివేకా మర్డర్ కేసులో అసలు సూత్రధారులు ఎవరో కనిపెట్టే దిశగా విచారణ సాగుతోంది. అందుకు అవసరమైన ఆధారాలు సేకరించే పనిలో దర్యాప్తును స్పీడప్ చేశారు సీబీఐ అధికారులు. అయితే, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు మొత్తం అప్రూవర్ అండ్ A3 దస్తగిరి ఇచ్చిన సమాచారం ఆధారంగా జరుగుతోంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వైఎస్ వివేకా మర్డర్ కేసు చిక్కుముడిని విప్పేందుకు ప్రయత్నిస్తున్నారు సీబీఐ అధికారులు. ఈ క్రమంలోనే సాక్షి మరణించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.