న్యూఢిల్లీ, జూన్ 9,
కాంగ్రెస్ పార్టీ పత్రిక నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. నేషనల్ హెరాల్డ్ ఆర్ధిక లావాదేవీల్లో జరిగిన అవకతవకలపై, మనీలాండరింగ్‌పై విచారణకు హాజరుకావాలంటూ ఈడీ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సోనియా, రాహుల్‌కు ఈడీ సమన్లు జారీ చేసిందంటూ ఆరోపణలు గుప్పించారు. నేషనల్ హెరాల్డ్ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదిగా కొట్టిపారేశారు. దీనికి బీజేపీ రాజకీయంగా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ ఆ పార్టీ సీనియర్ నేతలు హెచ్చరించారు. అటు దేశవ్యాప్తంగానూ కాంగ్రెస్ శ్రేణులు ఆయా రాష్ట్రాల్లో ఈడీ, కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో అనారోగ్య కారణాలతో ఈడీ ఎదుట హాజరయ్యేందుకు సోనియా మూడు వారాలు గడువు కోరగా.. అందుకు ఈడీ సమ్మతించింది. కోవిడ్ దృష్ట్యా కాంగ్రెస్ అధినేత్రి మూడు వారాల గడువు కోరగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమయం ఇచ్చినట్లు సమాచారం.అయితే.. రాహుల్ గాంధీ ఈనెల 13న ఈడీ ఎదుట హాజరయ్యేందుకు సమాయత్తమవుతున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఈడీ కార్యాలయానికి వెళ్లేందుకు పార్టీ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ఎంపీలు, సీనియర్ నాయకులు సోమవారం ఉదయం ఢిల్లీ అక్బర్ రోడ్డు పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని కాంగ్రెస్ సూచించింది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ చీఫ్‌లు, నాయకులతో గురువారం సాయంత్రం వర్చువల్ మీటింగ్‌ను నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా.. బలమైన గళాన్ని వినిపించేందుకు ఆయా రాష్ట్రాల్లో కార్యక్రమాలను నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. అంతకుముందు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ కోర్టుకు హాజరైనప్పుడు కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇదే రకమైన నిరసనలను తెలిపాయి.సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ జారీ చేసిన సమన్లపై కాంగ్రెస్ తరపు వాదనలు ఒకలా ఉంటే.. రాజ్యాంగ నిపుణులు, సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయం మరోలా ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరై నిజానిజాలేంటో వివరణ ఇస్తే సరిపోతుందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థల్లో ఒక్కటైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విశ్వసనీయతను ప్రశ్నించేలా ఇలా ఆందోళన కార్యక్రమాలకు పార్టీ తరపున పిలుపునివ్వడం సరికాదని పేర్కొంటున్నారు. చట్టాలకు, రాజ్యాంగానికి గాంధీ కుటుంబం అతీతం కాదని గుర్తు చేస్తున్నారు.గతంలో గోద్రా అల్లర్ల కేసుకు సంబంధించి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారని గుర్తు చేస్తున్నారు. ఏకంగా తొమ్మిది గంటలపాటు సిట్ సంధించిన ప్రశ్నలను మోడీ ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో సిట్ నుంచి సమన్లు అందుకున్న ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.చట్టానికి ఎవరూ అతీతులు కాదు.. నేను సిట్ విచారణకు హాజరవుతాను.. చట్టం, రాజ్యాంగం అత్యున్నతమైనవి… పౌరుడిగా నేను వాటికి కట్టుబడి ఉన్నాను’’ అంటూ ప్రధాని మోడీ ఆ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.