YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కిం.. కర్తవ్యం... ఇద్దరు నేతల దారెటు

కిం.. కర్తవ్యం... ఇద్దరు నేతల దారెటు

ఏలూరు, జూన్ 10,
పీతల సుజాత.. కొత్తపల్లి జవహర్‌. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఈ ఇద్దరు టీడీపీ నేతలు గతంలో మంత్రులుగా పనిచేశారు. 2014లో చింతలపూడి నుంచి సుజాత, కొవ్వూరు నుంచి జవహర్‌ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇద్దరూ స్థానికేతరులైనప్పటికీ.. అక్కడ టీడీపీకి బలం ఉండటంతో అసెంబ్లీలో ఆనాడు ఈజీగానే అడుగు పెట్టేశారు. గత ప్రభుత్వంలో ముందుగా సుజాత.. తర్వాత జవహర్‌ కేబినెట్‌ మంత్రులయ్యారు. గెలిచిన కొత్తలో బాగానే ఉన్నా.. మంత్రులయ్యాక నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయి. తగాదాలను పరిష్కరించకుండా.. ఆధిపత్య ధోరణి ప్రదర్శించడంతో ఇద్దరికీ మొదటికీ మోసం వచ్చిందని ఇప్పటికీ చెబుతారు.2019 ఎన్నికల నాటికి వర్గపోరు తీవ్రం కావడంతో అది అభ్యర్థుల ఎంపికపైనా ప్రభావం చూపించింది. చివరకు పీతల సుజాతకు చింతలపూడి టికెట్‌ ఇవ్వలేదు టీడీపీ అధిష్ఠానం. జవహర్‌ను కొవ్వూరు నుంచి తిరువూరుకు పంపింది పార్టీ. ఈ మార్పులు చేసినప్పటికీ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి కలిసి రాలేదు. అప్పటి నుంచి చింతలపూడి, కొవ్వూరుల్లో పార్టీ కేడర్‌ను అంటిపెట్టుకున్న నాయకులే కరువయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి టీడీపీలో ఆశావహుల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ పోయిన చోటే వెతుక్కోవాలని సుజాత, జవహర్‌ చూస్తున్నారట.చింతలపూడిలో సుజాత, కొవ్వూరులో జవహర్‌ మరోసారి చురుకుగా పావులు కదుపుతున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు తయారు చేసుకున్న అనుచరులతో మళ్లీ టచ్‌లోకి వెళ్తున్నారట. అసంతృప్త నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట నాయకులు. అవకాశం చిక్కితే తాము కేడర్‌కు అందుబాటులో ఉన్నామనే సంకేతాలను అధినేత దృష్టికి వెళ్లేలా తెగ పాట్లు పడుతున్నారట. పనిలో పనిగా వచ్చే ఎన్నికల్లో తమకు ఆర్థికంగా సాయం చేసేవారి వేటలోనూ పడ్డారట మాజీ మంత్రులు. వీరి ఫీట్లు చూశాక.. ఇప్పుడీ పాట్లు ఎందుకు.. అందరితో అప్పుడే సఖ్యతగా ఉంటే పోయేదిగా అని తెలుగు తమ్ముళ్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట.రెండు నియోజకవర్గాల్లోనూ ప్రస్తుతం టీడీపీ కేడర్‌ అధిష్ఠానం ఆదేశాల కోసం ఎదురు చూస్తోంది. అయితే చింతలపూడి, కొవ్వూరులు ఎస్సీ రిజర్వ్డ్‌ నియోజకవర్గాలు కావడంతో ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. సుజాత, జవహర్‌లు మాత్రం టికెట్‌ తమకే వస్తుందనే పూర్తి ధీమాతో పర్యటనలు చేస్తున్నారట. కానీ.. మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన కామెంట్స్‌ను ఈ సందర్భంగా కేడర్‌ గుర్తు చేస్తోంది. కష్టపడ్డవారికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని అధినేత కుండబద్దలు కొట్టారు. ఆ లైన్‌ను ఆధారంగా చేసుకునే సుజాత, జవహర్‌లు పట్టుకోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరి.. మాజీ మంత్రుల విషయంలో చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయో? పాత వారికే పిలిచి టికెట్‌ ఇస్తారో.. కొత్త వారికి పట్టం కడతారో చూడాలి

Related Posts