కాకినాడ, జూన్ 10,
అధికార వైసీపీ నుంచి ఇటీవల సస్పెన్షన్ కు గురైన కొత్తపల్లి సుబ్బారాయుడితో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ముద్రగడ.. నర్సాపురంలోని కొత్తపల్లి నివాసానికి చేరుకుని.. దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. అయితే వీరి భేటీలో ఏ ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనే అంశాలపై ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు. ఈ భేటీ అనంతరం ముద్రగడ మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాలు ఇస్తోందని పరిశీలకులు అంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ఇటీవల వరకు ముద్రగడ యమా సైలెన్స్ పాటిస్తూ వచ్చారు. ఇక జిల్లాల విభజనకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. తూర్పు గోదావరి జిల్లాను విభజిస్తే... ఓ జిల్లాకు బి.ఆర్ అంబేద్కర్, మరో జిల్లాలకు బాలయోగి పేర్లు పెట్టాలంటూ సీఎం వైయస్ జగన్‌కు నేరుగా ఆయన బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే అమలాపురం కేంద్రంగా కొనసీమ జిల్లా ఏర్పాటు చేసిందీ జగన్ ప్రభుత్వం.. ఆ తర్వాత బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చింది. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు వరకు కొత్త పల్లి, ముద్రగడల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాల విభజన మొదలు.. బ్రిటిష్ కాలం నుంచి రెవిన్యూ డివిజన్ ఉన్న నరాసాపురాన్ని జిల్లా కేంద్రం చేయకపోవడం...అలాగే రెవిన్యూ డివిజనే లేని భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడం.. జిల్లా విభజన క్రమంలో ఎవరినీ సంప్రదించక పోవడం.. అలాగే నరాసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుని.. ఎమ్మెల్యేగా ఎం ప్రసాదరాజును గెలిపించడం కోసం తాను, తన సోదరుడు కొత్తపల్లి జానకీరామ్ పడిన కష్టం.. అన్నీ పూసగుచ్చినట్లు కొత్తపల్లి ముద్రగడకు వివరించినట్లు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన జగన్ ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోవడమే కాకుండా.. అయిదుసార్లు ఎమ్మెల్యే, ఓ సారి ఎంపీగా, మంత్రిగా, కార్పొరేషన్ చైర్మన్‌గా వివిధ పదవులలో సేవలందించి రాణించిన తన లాంటి సీనియర్‌ను జగన్ పక్కన పెట్టడం పట్ల కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంపీ రఘు రామకృష్ణంరాజు జగన్ నుఎన్ని తిట్లు తిట్టినా... ఆయనను వదిలేసి.. తనను సస్పెండ్ చేయడం ఏమిటో అర్థం కావడం లేదని ముద్రగడ ముందు కొత్త పల్లి సుబ్బారాయుడు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా కాకుండా.. భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడం పట్ల నరసాపురం ప్రాంత ప్రజలు.. జగన్ పైనా, వైసీపీపైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ముద్రగడకు కొత్తపల్లి వివరించినట్లు తెలుస్తోంది. అదీకాక.. రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యంత కీలకమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొత్తపల్లితో భేటీ కావడం.. ఆ క్రమంలో సుదీర్ఘ మంతనాలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా అందరిలో ఉత్కంఠ, ఆసక్తి రేకెత్తించింది