YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో విన్ విన్ ఫార్ములా

ఏపీలో విన్ విన్ ఫార్ములా

విజయవాడ, జూన్ 10,
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పొత్తు పొడుపుల చర్చ ఎన్నికల వరకూ సాగుతూనే ఉండేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో వైసీపీకి ప్రజాదరణ వేగంగా, గణనీయంగా తగ్గిపోతోందన్న అంచనాతో పార్టీలు వేటికవి తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవిడానికి ఇదే అదును అని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే పొత్తు పొడుపుల చర్చ ఆగకుండా నడుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనతో పొత్తు పొడుపులపై దాదాపు స్పష్టత వచ్చింది.
జనసేనాని ఆప్షన్ ఇవ్వడం ద్వారా ఇటు తెలుగుదేశం పార్టీ, అటు బీజేపీ రెంటికీ పెద్దగా అక్కరకు రాని మిత్రుడిగా మిగిలిపోయారు. ఇక మిగిలింది తెలుగుదేశం, బీజేపీ.. ఈ రెండు పార్టీలూ కూడా ఏపీలో కలిసి పోటీ చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నాయి. అయితే బీజేపీకి ఏపీలో కనీసంలో కనీసం ఒక శాతం ఓట్లయినా ఉన్నాయా అన్నది అనుమానమే. అయితే కేంద్రంలో అధికారంలో ఉండటం, మరో మారు అధికారం చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉండటంతో ఆ పార్టీకి ఏపీలో అసెంబ్లీ స్థానాల కన్నా.. పార్లమెంటు నియోజకవర్గాలలో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం ముఖ్యం. దీంతో పార్లమెంటు అభ్యర్థులను గెలిపించుకోవాలంటే అందుకు తెలుగుదేశంతో పొత్తు ఆ పార్టీకి అవసరం.
జనసేనతో కలిసి వెళ్లినా.. ఆ పార్టీ అండతో పార్లమెంటు స్థానాలలో విజయం సాధించగలమన్న ధీమా బీజేపీలో కనిపించడం లేదు. దానికి తోడు ఆయన చీటికీ మాటికీ   తన బలాన్ని హెచ్చుగా ఊహించుకుంటూ కండీషన్స్ అంటున్నారు. ఈ కారణంగానే నడ్డా తన రాష్ట్ర పర్యటనలో భాగంగా చేసిన ప్రసంగాలలో ఎక్కడా జనసేన ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పట్ల బీజేపీ వ్యతిరేక వైఖరిని విస్పష్టంగా తెలియజేశారు.
అంతటితో ఊరుకుని ఉంటే తెలుగుదేశం, బీజేపీ పొత్తులపై ఇన్ని రాజకీయ స్పెక్యులేషన్స్ వచ్చి ఉండేవి కావు. ఇప్పటి దాకా రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్ పై ఒకింత అభిమానం ఒలకబోస్తూ తమల పాకుతో తట్టినట్లుగా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ, విపక్ష తెలుగుదేశంపై మాత్రం పదునైన ఘాటు విమర్శలతో విరుచుకుపడేవారు. నడ్డా అందుకు భిన్నంగా తెలుగుదేశంపై చిన్న పాటి విమర్శ కూడా లేకుండా, అదికార వైసీపీపైనే తన విమర్శల దాడి సాగించారు.  ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి చేరువ అవ్వడానికి బీజేపీ సిద్ధమన్న సంకేతం ఇవ్వడమే. ఆ సంకేతాన్ని తెలుగుదేశం సరిగ్గానే అందిపుచ్చుకుంది. బీజేపీతో పొత్తు కుదిరితే లాభ నష్టాలపై పార్టీలో అధినేత చంద్రబాబు నేతృత్వంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఈ చర్చల్లో పవన్ కల్యాణ్ పార్టీతో పొత్తు వల్ల లాభల కంటే నష్టాలే ఎక్కువ అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమైందని చెబుతున్నారు. ఎందుకంటే జనసేనతో పొత్తు ఉంటే.. పొత్తులో భాగంగా కనీసంలో కనీసం పాతిక అసెంబ్లీ స్థానాలైనా ఆ పార్టీకి వదులు కోవాల్సి ఉంటుంది.అన్ని స్థానాలలో విజయం సాధించేంత బలం ఆ పార్టీకి ఉందో లేదో అనుమానమే. ఈ అనుమానానికి గత ఎన్నికలలో ఆ పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేసి కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించడం, ఆ పార్టీ అధినేత స్వయంగా రెండు స్థానాలలో పోటీ చేసి రెండు చోట్లా పరాజయం పాలు కావడమే కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి అసెంబ్లీ స్థానాలపై పెద్దగా పట్టు ఉండదు. ఎందుకంటే రాష్ట్రంలో తమ స్టేక్ ఏమిటి, తమ బలం ఏమిటి, తమకు ఉన్న ఓటు శాతం ఎంత అన్న స్పష్టత ఉంది.  అదీ కాక ఆ పార్టీకి రాష్ట్రంలో అధికారం చేపట్టడం కన్నా కేంద్రంలో అధికారం నిలుపుకోవడమే ముఖ్యం. అందు కోసం  ఆ పార్టీ పొత్తులో భాగంగా అసెంబ్లీ స్థానాల కోసం పెద్దగా పట్టుబట్టదు. ఆ పార్టీకి పార్లమెంటు స్థానాలలో తమ అభ్యర్థుల విజయం అవసరం. ఇక తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో చక్రం తిప్పాలన్న ఉద్దేశం ఇప్పటికైతే లేదు. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యం. అందుకే బీజేపీతో  పొత్తు కుదరడమంటూ జరిగితే.. ఆ పార్టీకి రాష్ట్రంలోని పాతిక పార్లమెంటు స్థానాలలో సగం వరకూ ఆ పార్టీకి కేటాయించడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఇది విన్ విన్ ఫార్ములాగా చంద్రబాబు భావిస్తున్నారు.ఇదే ప్రతిపాదనతో బీజేపీకి ఎర వేయాలని ఆయన పార్టీ నేతలతో చర్చ సందర్భంగా ప్రస్తావించినట్లు సమాచారం. బీజేపీకి కూడా ఈ ప్రతిపాదన ఆ పార్టీ అవసరాలకు తగినట్లు ఉంటుంది. రాష్ట్రంలో బలం లేకపోయినా తెలుగుదేశం అండతో పోటీ చేసే పార్లమెంటు స్థానాలలో అత్యధిక స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆప్షన్స్ వల్ల తెలుగుదేశం, బీజేపీ దగ్గరయ్యే పరిస్థితి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Related Posts