YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాష్ట్రపతి ఎన్నికపై కాంగ్రెస్ లెక్కలు

రాష్ట్రపతి ఎన్నికపై కాంగ్రెస్ లెక్కలు

ముంబై, జూన్ 10,
రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు జులై 18న ఓటింగ్‌ నిర్వహించనున్నారు. జులై 21న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నెల 15వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ గురువారం వెల్లడించారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ పదవీకాలం జులై 24తో ముగియనుంది. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ పార్టీ.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలపై దృష్టిసారించాయి. ఇప్పటికే.. బీజేపీ ఎన్డీఏ కూటమిలోని పార్టీలతోపాటు.. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించింది. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ సైతం రాష్ట్రపతి ఎన్నికలపై దృష్టిసారించి.. పలు పార్టీల సీనియర్లతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే కీలక ప్రకటన చేశారు. పలు పార్టీల సీనియర్లతో భేటీ అయి అభ్యర్థి పేరు గురించి ఆలోచించాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తనను ఆదేశించినట్లు కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే  పేర్కొన్నారు.రాష్ట్రపతి ఎన్నికలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో మాట్లాడిన తర్వాత మల్లికార్జున ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. తమతోపాటు శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే, డీఎంకే, టీఎంసీ, పలు పార్టీల కీలక నాయకులను కలుస్తామని.. అనంతరం రాష్ట్రపతి ఎన్నికలపై ఒక కీలక సమావేశానికి తేదీని నిర్ణయిస్తామని మల్లికార్జున ఖర్గే  తో చెప్పారు. శరద్ పవార్ కూడా ఇదే అంగీకరించారని పేర్కొన్నారు. ఈ సమావేశం అనంతరం అభ్యర్థి పేరును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోసం ప్రతిపక్షాలు సంప్రదింపులు ప్రారంభించగా.. బీజేపీ సైతం ముందు నుంచి వ్యూహాలను రచిస్తూ వస్తోంది. పార్లమెంటు ఉభయ సభల్లోని 772 మంది సభ్యుల ప్రస్తుత బలంలో బీజేపీకి 392 మంది ఉన్నారు. ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటుకు దాదాపు సగం ఓట్లు ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. కావున ఉభయ సభల్లో బీజేపీని ప్రతిపక్ష సభ్యుల కంటే మెజారిటీలోనే ఉంది.
ప్రస్తుతం, లోక్‌సభలో 3, రాజ్యసభలో 13 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇవి పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. నాలుగింటిని బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో బీజేపీ బలం కూడా పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ రెండోసారి అధికారం చేజిక్కించుకున్నప్పటికీ.. సంఖ్య తగ్గింది.అయితే.. ఎలక్టోరల్ కాలేజీలో ఇప్పటికే అధికారంలోని ఎన్డీఏకు దాదాపు 50 శాతం ఓట్లు ఉన్నాయని బీజేపీ నేత ఒకరు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. ఈ కూటమికి ఏపీలోని జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్‌సీపీ, నవీన్ పట్నాయక్‌కు చెందిన బీజేడీ వంటి ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతోపాటు కాషాయ పార్టీ తన కూటమిలోని ఏఐఏడీఎంకే మద్దతు కూడా పొందనుంది.
రాష్ట్రపతి కోవింద్ 25 జూలై 2017న పదవీ బాధ్యతలు స్వీకరించారు. NDA రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు చేసిన సమయంలో రామ్‌నాథ్ కోవింద్ బీహార్ గవర్నర్‌గా ఉన్నారు. ఈ సమయంలో విపక్షాలు మీరా కుమార్‌ను తమ అభ్యర్థిగా బరిలోకి దింపాయి. అయితే కోవింద్ 65.65 శాతం ఓట్ల రాగా.. మీరా కుమార్‌కు కేవలం 34.35 శాతం మాత్రమే వచ్చాయి.

Related Posts