YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆరుగురు ఎమ్మెల్యేలపై పార్టీలో చర్చ

ఆరుగురు ఎమ్మెల్యేలపై పార్టీలో చర్చ

విజయవాడ, జూన్ 11,
ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ గత నెల 11న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పిలుపిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గ పరిధిలోని ఒక్కో గ్రామ, వార్డు సచివాలయాన్ని రెండురోజులపాటు సందర్శించాలి. నెలలో పది సచివాలయాలకు వెళ్లాలని శాసనసభ్యులకు సీఎం జగన్‌ టార్గెట్‌ ఫిక్స్‌ చేశారు. ఆ సచివాలయాల పరిధిలో ఉండే కుటుంబాల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల లేఖను అందజేయాలి. వారిని అడిగి పథకాలు అందుతున్నయో లేదో నిర్ధారించుకోవాలని చెప్పారు. సమస్యలు ఉంటే పరిష్కారానికి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదీ.. ప్రధానంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్వరూపం. మొత్తంగా నెలకు 20 రోజులు ఫీల్డ్‌లోనే ఉండాలి ఎమ్మెల్యేలు. అయితే ఏ ఎమ్మెల్యే ఫీల్డ్‌లోకి వెళ్లారు.. క్షేత్రస్థాయిలో వారేం చేశారో సమగ్ర చిట్టా ప్రభుత్వానికి చేరిపోయింది. డైలీ రిపోర్ట్స్‌ రూపంలో వివరాలు సీఎం జగన్‌ దగ్గర ఉన్నాయి.ఎమ్మెల్యేల పనితీరుపై సచివాలయ సిబ్బందితోపాటు ఐపాక్‌ టీమ్‌ నిఘా వేశారు. సమగ్ర నివేదికలు ఇచ్చేశారు. ఇంత పక్కాగా వేగుల వ్యవస్థ ఉన్నప్పటికీ.. కొందరు ఎమ్మెల్యేలు కార్యక్రమాన్ని లైట్‌ తీసుకున్నారు. లాస్ట్ బెంచ్‌ స్టూడెంట్‌ల మాదిరే వ్యవహరించారు. మరికొందరు మొక్కుబడిగా హాజరు వేయించుకున్నారట. ఇదంతా ఒక్క ఎత్తు అయితే అసలు గడప దాటని.. కాలు కదపని బ్యాచ్‌ కూడా ఉందని తెలిసి అధికార పార్టీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ జాబితాలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండటంతో వారు చూట్టూనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది.మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కాలు కదపని జాబితాలో ఉన్నారట. మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా హాజరు కాకపోయినా.. విజయనగరం ఎంపీ చంద్రశేఖర్‌ చీపురుపల్లిలో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్‌ విదేశాలకు వెళ్లడంతో మైలవరంలో ఆయన తిరగలేదని చెబుతున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆళ్ల నాని ఏలూరులో పర్యటించలేదట. మంత్రి పదవి రాలేదనే నిరాశలో ఉన్న ప్రసన్న కుమార్‌రెడ్డి.. అనారోగ్య కారణాలతో కోవూరులో గడప దాటలేదని తెలుస్తోంది. శిల్పా చక్రపాణి రెడ్డి మాత్రం అనారోగ్య కారణాలతో అధిష్ఠానం దగ్గర అనుమతి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇక కుమారుడి వివాహం కారణంగా ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గడప గడప కార్యక్రమానికి దూరంగా ఉన్నట్టు టాక్‌. మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విషయంలో ఏం జరిగిందో ఆరా తీస్తున్నారట. అయితే జిల్లాలో ఆత్మకూరు ఉపఎన్నిక ఉండటంతో ఇప్పట్లో గడప గడపకు మన ప్రభుత్వం ఉండబోదని అనుకుంటున్నారు. అయితే డుమ్మా బ్యాచ్‌ను ప్రస్తుతానికి ఎక్స్‌క్యూజ్‌ చేసినా.. తీరు మారకపోతే ఏం చేస్తారన్నదే ప్రస్తుతం ప్రశ్న.

Related Posts