విజయవాడ, జూన్ 11,
రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పుడు వైసీపీ కీలకంగా మారుతోంది. ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన జారీ చేయటంతో..ఇప్పుడు ఇందులో ఏ పార్టీకి ఏ మేర ప్రభావం చూపిస్తోంది.. ఎంత మేర ఓట్ల విలువ ఉందనే చర్చ మొదలైంది. ప్రధానంగా ఎన్డీఏ - కాంగ్రెస్ మద్దతు కూటమి మధ్య ఓట్ల తేడాలో స్వల్పంగా ఎన్డీఏ వ్యతిరేక కూటమికి ఎక్కవ ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలు సైతం ఇందులో భాగంగానే హోరా హీరీగా మారాయి. దీంతో..మూడు ప్రాంతీయ పార్టీలైన బీజేడీ..టీఆర్ఎస్..వైసీపీ క్రియాశీలకంగా మారాయి. టీఆర్ఎస్ ఇప్పటికే ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉంది. వైసీపీ ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా.. పలు కీలక సందర్భాల్లో మద్దతిస్తూ వచ్చింది. గత రాష్ట్రపతి ఎన్నికల్లోనూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక గురించి ప్రధాని మోదీ - సీఎం జగన్ తో చర్చించారు. జగన్ మద్దతు ఇస్తే..బీజేడీ పార్టీ ఎన్డీఏ మద్దతు ఇచ్చినా..ఇవ్వకపోయినా పెద్దగా ప్రభావం పడదు. ఇక, ఓట్ల శాతంలో చూస్తే.. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ - రాజ్యసభ లో మొత్తం 36 మంది ఎంపీల ఓటు విలువ 25,488గా ఉంది. అదే విధంగా.. అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 27,825 గా నిర్దారించారు. దీంతో..రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువ 53,313 గా ఉంది. ఇందులో వైసీపీ ఓటు వాటా 45,957 గా నిర్దారణ అయింది వైసీపీకి నాలుగు శాతం ఓటు షేర్ రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు 25 ఉండగా, ఇందులో 22 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీలు, ముగ్గురు టీడీపీకి చెందిన ఎంపీలున్నారు. రాజ్యసభ స్థానాలు 11 ఉండగా ఇందులో వైస్సార్‌సీపీకి చెందిన ఎంపీలు 9 మంది, టీడీపీ, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రాష్ట్ర జనాభా లెక్కన ఎంపీలు..ఎమ్మెల్యేల ఓటు విలువ నిర్ణయిస్తారు. 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన దీనిని డిసైడ్ చేస్తున్నారు. దీంతో..ఏపీలో ఒక్కో ఎంపీ ఓటు విలువ 708గా ఉంది. ఆ లెక్కన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159గా నిర్ధారించారు. రాష్ట్రంలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 27,825గా నమోదైంది. రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ 53,313గా ఖరారు చేసారు. అభ్యర్ధి ప్రకటన వచ్చేకా తుది నిర్ణయం వైసీపీ నుంచి లోక్‌సభ సభ్యులు 22 మంది, రాజ్యసభలో మరో 9 మంది ఎంపీలకు కలిపి మొత్తం ఓటు విలువ 21,948 కాగా, 151 మంది ఎమ్మెల్యేలకు 24,009 ఓటు విలువ ఉంది. ఈ లెక్కన దేశ వ్యాప్తంగా ఎలక్టోరల్ కాలేజీలో వైసీపీ ఓట్ షేర్ నాలుగు శాతం వరకు ఉందని తేల్చారు. ఏపీ నుంచి ఉన్న మొత్తం 53,313 ఓటు విలువలో వైఎస్సార్‌సీపీ 45,957 ఓటు విలువ కలిగి ఉంది. దీంతో..అభ్యర్ధులు ఖరారు అయిన తరువాత పార్టీల నుంచి తమ మద్దతు విషయం పైన అఫీషియల్ ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ నిర్ణయం కీలకంగా మారబోతోంది.