హైదరాబాద్, జూన్ 11,
రాష్ట్రపతి పదవికి జరగాల్సిన ఎన్నిక దగ్గర పడుతోంది. ఎవర్ని ఎంపిక చేయాలన్న విషయంపై కేంద్రంలో అధికారంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి అవసరమైన బలానికి కూతవేటు దూరంలో (1.2 శాతం ఓట్లు) నిలిచింది. ఆ కూతవేటు బలాన్ని వైసీపీద్వారాకానీ, బీజేడీద్వారాకానీ, అన్నాడీఎంకేద్వారా కానీ సమకూర్చుకోగలమనే ఆత్మవిశ్వాసంతో మోడీ ప్రభుత్వం ఉంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవలే దేశవ్యాప్తంగా పర్యటించారు. ఆయనైతే రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించడానికి సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. అయితే మూడు సంవత్సరాల నుంచి లోక్‌సభలోకానీ, రాజ్యసభలోకానీ బలం తగ్గినప్పుడల్లా ఆదుకుంటున్న వైసీపీ వెంకయ్యనాయుడైతే మద్దతిచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పినట్లు ఢిల్లీలోని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి నుంచి మద్దతిస్తున్న వైసీపీ మాటను కాదనుకుండా గౌరవిద్దామా? లేదంటే వైసీపీని ఒప్పిద్దామానా? అనే చర్చలు కూడా బీజేపీలో నడుస్తున్నాయి. వెంకయ్యనాయుడి శరీరం బీజేపీలో, మనసు తెలుగుదేశంలో ఉంటుందని గతంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది.తెలంగాణ ప్రభుత్వానికి, తమిళసైకి హోరాహోరీ యుద్ధం! తమిళసై సౌందరరాజన్‌కు కూడా అవకాశం ఉంది. కానీ బీజేపీ మీద యుద్ధాన్ని ప్రకటించి కేసీఆర్ సౌందరరాజన్‌ను ఒకవేళ ఎంపిక చేస్తే ఆమెకు అవకాశం లేకుండా చేయడానికి వ్యూహాలు పన్నుతున్నట్లు తెలంగాణ రాష్ట్రసమితి వర్గాలు చెబుతున్నాయి. కొన్నాళ్లుగా తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళసైకి, అధికార టీఆర్ఎస్‌కు హోరాహోరీ యుద్ధం నడుస్తోంది. కొన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ నేరుగా జోక్యం చేసుకుంటున్నారని టీఆర్ ఎస్ ఆరోపణ. తాజాగా ఆమె మహిళా దర్బార్ నిర్వహించి రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. తనను కలిసిన మహిళలంతా రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారల గురించే చెబుతున్నారరి తమిళసై చెప్పారు. తెలంగాణ మహిళల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎదురు చెప్పేవాళ్లను తాను పట్టించుకోనని, తననెవరూ అడ్డుకోలేరని ఆమె వ్యాఖ్యానించారు. నాలుగురోజుల క్రితం సంచలనం నమోదవుతుందని ప్రకటించిన కేసీఆర్ మాట రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక గురించేనని అందరూ భావిస్తున్నారు. శరద్‌పవార్ అయితే ప్రతిపక్షాలతోపాటు బీజేపీ పక్షాలు కూడా మద్దతిస్తాయనేది కేసీఆర్ యోచనగా ఉంది. అయితే శరద్‌పవార్ ఏ విషయం తేల్చలేదు. అన్నాహజారేను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలనేది కేసీఆర్ రెండో ప్రణాళికగా ఉంది. ప్రస్తుతానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది కాబట్టి ఇంకా ఎన్ని రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో వేచిచూడాల్సి ఉంది.