జూన్ 18 నుంచి జూలై 9 దాకా అమెరికాలో పెద్ద ఎత్తున శ్రీనివాస కల్యాణాలు - భక్తులు ఉచితంగా కల్యాణంలో పాల్గొనవచ్చు
టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
అమెరికా దేశంలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి జూలై 9వ తేదీ వరకు ఎనిమిది నగరాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో శనివారం ఆయన ఈవో ధర్మారెడ్డి తో కలసి మీడియాతో మాట్లాడారు. గత రెండున్నరేళ్లుగా కరోనా వల్ల ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు అమెరికాలోని భక్తుల కోసం టీటీడీ శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాసభారతీయుల అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు. జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు నిర్వహిస్తామని ఛైర్మన్ చెప్పారు. అలాగే జూలై 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్ డిసి, 9వ తేదీ అట్లాంటా నగరాల్లో శ్రీవారి కళ్యాణాలు జరుగుతాయన్నారు. ఇతర దేశాల నుంచి కూడా తమ ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని విజ్ఞప్తులు వచ్చాయని వాటిని కూడా పరిశీలిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. ప్రపంచం వ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.