పలాస
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషకు రెండోసారి సీఐడీ అధికారుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 20న ఉదయం 10 గంటలకు గుంటూరు కార్యాలయంలో తదుపరి విచారణకు హాజరవ్వాలంటూ పలాస తెదేపా కార్యాలయంలో నోటీసులు అందజేశారు. శిరీష వాటిని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న కుటుంబాన్ని అధికార పార్టీ వేధిస్తోందని, కార్యకర్తలెవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఏ తప్పూ చేయలేదని, ధైర్యంగా ఎదుర్కొంటున్నామని ఆమె వివరించారు. అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను నిలిపేస్తున్నట్లుగా ఉన్న నకిలీ ప్రెస్‌నోట్‌ను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారని గత నెల 29న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. గౌతు శిరీషను కూడా నిందితురాలిగా పేర్కొని ఈనెల 6న మంగళగిరిలో మొదటిసారి విచారించిన విషయం తెలిసిందే.