తిరుమల, జూన్ 13,
తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీంతో తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది..ఆదివారం తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. భక్తజనం విపరీతంగా రావడంతో కొండపై భక్తులతో కిటకిట నెలకొంది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. వైకుంఠం, నారాయణగిరి కంపార్ట్ మెంట్లన్నీ నిండి భక్తులు 3 కిలో మీటర్ల మేరా క్యూలైన్‌లో వేచి ఉన్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భక్తుల తాకడితో క్యూలైన్లు శ్రీవారి సేవా సదన్ వరకు నిండారు.భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి సెక్టార్‌కి ప్రత్యేకంగా అధికారులను కేటాయించినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రస్తుతం క్యూలైన్లలోకి చేరుకుంటున్న భక్తులకు శ్రీవారి దర్శించుకోవడానికి రెండు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరస్థితి ఉంది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు ఆహార సదుపాయం కల్పిస్తున్నామని, ఆదివారం రాత్రికి భక్తుల రద్దీ తగ్గే అవకాశముందని పేర్కొన్నారు. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా సిఫార్లు లెటర్స్ ద్వారా ఇచ్చే బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. అలాగే వారపు ఆర్జిత సేవలను కూడా రద్దు చేసినట్లు ధర్మారెడ్డి తెలిపారు.