విజయవాడ, జూన్ 13,
వెయ్యి అంటాం.. అన్నీ చేస్తామా.. అవసరార్ధం ఏదో అంటాం.. అపరాధం శమించుగాక అనీ మళ్లీ అదే మాట వెనక్కి తీసుకుంటాం.. చేయకూడదా.. అర్ధంచేసుకోరూ..!! వెనకటికి ఒక స్వాములారు ఈ ఏడాది కొంప కూలేట్టు వర్షాలు పడతాయన్నారు. తీరా చూస్తే పడలేదు. తర్వాత ఆయనే దేవుడు శపించాడని చెప్పి పారిపోయాడు!ఇలా జరుగుతుంటాయి. కాదన్నది, ఇప్పుడు అవసరమయింది జగన్ ప్రభుత్వానికి. తప్పేముంది అంటే తప్పేమరి! మద్యం మత్తులో అన్యాయాలు జరుగుతున్నాయి. సమాజంలో దారుణాలు జరుగుతున్నాయని ప్రభుత్వం భావించి మద్యం నిషేధించడానికి దీప ప్రమాణం చేసి కంకణం కట్టుకున్నారు. అప్పుడు అది తప్పనిసరి. అసలు ప్రభుత్వానికి మద్యం అమ్మకాలే కోట్లలో డబ్బు కుమ్మరిస్తుందన్నది తెలిసినదే. కాబోతే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కంటే కోట్లు ప్రధానం కాదనుకున్నవారు నిషేధాన్ని గురించి భారీ ప్రచారాలు చేసేరు.కొంత సమయం గడిచేక ఒర్నాయనో, అదే మంచి రూటు అనిపించి వుండవచ్చూ. ప్రభుత్వం మద్యం అమ్మకాలను కట్టుదిట్టంగా అమలుచేయడానికి సంకల్పించింది. ఎక్కడపడితే అక్కడ కాకుండా దానికీ ఓ లెక్క వుండాలన్నది. అందుకే దుకాణాల దగ్గర గొడవలు కాకుండా ఒక పద్దతి ప్రకారం అమ్మకాలు జరగాలని కాపాలా దారులను ఏర్పాటు చేసింది. వారిలో దురదృష్టవశాత్తూ కొందరు టీచర్లూ పహారా పనుల్లో వుండడం విపక్షాల కంటపడి ఆ సంగతి రచ్చకెక్కింది. కరోనా కారణంగా అన్ని రంగాలు దాదాపు కుదేలయ్యాయి.ఆదాయమార్గాలు దాదాపు మూసుకుపోయాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అప్పులతోనే కాపురం కొనసాగించడమూ కష్టమే. ఎన్నాళ్లిలా సాగుతుంది పాలన. అందుకే మద్యానికి మళ్లీ పొర్లే అవకాశం ఇచ్చేరు. వేల కోట్లు వచ్చిపడే వీలున్నదాన్ని కాదు పొమ్మంటే అసలుకే ఎసరు అవుతుంది.అందుకే ఓకే అనేసేరు. మరి గత ప్రమాణాలు, బోధల మాటేమిటని అడిగినా సమా ధానం చెప్పే స్థితిలో ప్రభుత్వం లేదు. ధనార్జన అవసరం. అందుకోసం గతంలో చెప్పిన మాటలు నీటి మూటలుగానే మారిపోవడం చేసి చూపారు. పరిస్థితులు ఒకేలా వుండాలని లేదు. వుంటాయనుకోవడం, తన మాటను తానే వెనక్కు తీసుకోవాల్సి వస్తుందా అని అనుకోవడమే భ్రమ. ఒక్కోసారి పరిస్థితుల ప్రభావంతో మాటలు చేతలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది మరి! అదే ఇప్పుడు జగన్ కూడా చేసేడు. నాలుకను ఎలాగయినా మడతబెట్టవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి కార్పోరేషన్ బాండ్లు అమ్మి రెండువేల కోట్లు అభివృద్ధి కోసం అప్పు తెచ్చారు. ఇప్పుడు జగన్ సర్కార్ బేవరేజ్ కార్పొరేషన్ బాండ్లు అమ్మి ఎనిమిదివేల కోట్లు అప్పు తెచ్చుకుంది. పరిస్థితులు చేజారిపోతుంటే మరి వొంట్లో వొణుకు వస్తుందిగదా! ప్రగల్భాలకి ఇపుడు ఆస్కారం లేదు. అందుకే మద్యనిషేధానికి బ్రేక వేస్తూ ఇది తాత్కాలికం, పాక్షికం అంటూనే ఏపీ లిక్కర్ బాండ్లపై 9.62 శాతం వడ్డీకి 8 వేలకోట్లు అప్పు తెచ్చింది. ఇండియా రేటింగ్స్ సంస్థ బేవరేజెస్ కార్పోరేషన్‌కు ఏఏ రేటింగ్ ఇవ్వడం చిత్రం. ఎందుకంటే మద్యం విధానం మార్చబోమని దీప ప్రమాణం చేసిన తర్వాతనే ఈ రేటింగ్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు ఎవరికి ఎంత ముట్టచెప్పారన్నది తేలాల్సిన ప్రశ్న.