కడప, జూన్ 12,
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన సమాచారం జగన్ కు ముందే తెలుసా? వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు చేస్తున్న తాజా దర్యాప్తు క్రమాన్ని చూసినా, టీడీపీ నేత బుద్దా వెంకన్న చెబుతున్న మాటల్ని గమనించినా వాస్తవం లేకపోలేదేమో అనే మాట వినిపిస్తోంది. ఈ హత్య గురించి ముఖ్య నేతకు ముందే తెలుసని, అందుకే బాబాయ్ హత్యపై ఎక్కడా మాట్లాడడం లేదని బుద్దా వెంకన్న ఆరోపిస్తున్నారు. వివేకా హత్యకేసులో నిందితులను ఎందుకు కాపాడుతున్నారని బుద్దా నిలదీస్తున్నారు. ఈ హత్య కేసు నిందితులు అనుమానాస్పదంగా ఎందుకు మరణిస్తున్నారంటూ బుద్దా వెంకన్న ప్రశ్నిస్తున్నారు. మరో పక్కన.. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ అధికారులు మరింత ముమ్మరం చేశారు. దాంట్లో భాగంగా పులివెందులలోని జగన్ క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వ సర్వేయర్ తో కొలతలు తీయించడం, వీడియో, ఫొటోలు తీయించడం కూడా బుద్దా వెంకన్న మాటల్లో కొంతైనా నిజం ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. క్యాంపు ఆఫీసుతో పాటు అవినాశ్ రెడ్డి ఇంటికి కూడా సీబీఐ అధికారులు కొలతలు తీయించిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. నిప్పు లేనిదే పొగ రాదంటారు. వివేకా కేసులో సీబీఐ అధికారులకు లింక్ ఏదో దొరికి ఉండొచ్చని, అందుకే తమ దర్యాప్తును జగన్, అవినాశ్ రెడ్డి ఇళ్ల నుంచి కూడా చేస్తుండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా హత్య కుట్ర వెనుక ఓ కీలక మహిళ హస్తం ఉందని, ఆ ‘శివగామి’ ఎవరనే చర్చ కూడా గతంలో బాగా జరిగిన వైనాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు.గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో వివేకా హత్య జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అప్పట్లో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో గెలిచి, తాను సీఎం అయినా ఈ హత్య కుట్రను ఛేదించే విధంగా ఎందుకు ప్రయత్నించలేదనే ప్రశ్నలు పలువురి నుంచి వ్యక్తం అవుతున్నాయి. కేసు విచారణలో అసలు వాస్తవాలు బయటికి వస్తే.. బాగా కావాల్సిన వారెవరో ఇరుక్కుపోతారనే ముఖ్యనేత అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదేమో? అని ఇంత వరకూ అంతా అనుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు బుద్ధా వెంకన్న ఆరోపణలు, సీబీఐ దర్యాప్తు గమనించిన తరువాత అందుకేనన్న నిర్ధారణకు వస్తున్నారు.వివేకా హత్య కేసులో ముద్దాయిలెవరో తేల్చకుండా జగనే అడ్డుకుంటున్నారని జనం అనుకుంటున్నారన్న టీడీపీ నేత వర్ల రామయ్య మాటల్లో వాస్తవం లేకపోలేదంటున్నారు. అసలు ముద్దాయిలెవరో తేల్చాల్సిన బాధ్యత సీఎంగా జగన్ కు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై జగన్ ఆధ్వర్యంలోని స్థానిక పోలీసులు కేసులు పెట్టడం వెనక కారణం ఏంటో తెలియాలంటున్నారు. బాబాయ్ ని చంపిన అసలు ముద్దాయిలెవరో బయటికి రాకూడదు, అసలు ముద్దాయిలు అరెస్ట్ కాకూడదనే ఆలోచన ఎవరిదని వర్ల ప్రశ్నించడం గమనార్హం.వివేకా హత్య మిస్టరీ వెనుక అసలు రహస్యం మూడేళ్లు దాటిపోయినా వెలికి రాలేదు. సరికదా.. ఈ కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరికి బెదిరింపులు రావడం, ప్రాణహాని భయంతో దస్తగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, ఇదే కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించడం వెనుక పెద్ద తలకాయల ఒత్తిడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిటాల రవి హత్య తర్వాత మొద్దు శీనుతో పాటు నిందితులు, సాక్షులు ఎలా చనిపోయారో ఇప్పుడూ అదే జరుగుతోందని బుద్దా వెంకన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివేకా మర్డర్ కేసుకు సంబంధించి మరిన్ని సంఘటనలు భవిష్యత్తులో జరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో వివేకా కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డికి కూడా ప్రాణహాని ఉండొచ్చని, వారికి రక్షణ కల్పించాలనే డిమాండ్ వస్తోంది.