YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జూన్ 15న ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల భేటీ

జూన్ 15న ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల భేటీ

హైదరాబాద్, జూన్ 13,
కేసీఆర్ ఆరంభించి ఆపేసిన పనిని ఇప్పుడు మమతా బెనర్జీ ఆరంభించారు. జాతీయ రాజకీయాలలో తన ఎంట్రీ ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవడానికి శతధా ప్రయత్నించారు. నేతలతో భేటీ అయ్యారు. పర్యటనలు చేశారు. మంతనాలు జరిపారు.అయితే అవేవీ ఫలించలేదు. ఎక్కడా ఆయనకు సానుకూలత ఎదురు కాలేదు.దీంతో ఆయన ఆయన సహజ శైలికి భిన్నంగా గత కొద్ది రోజులుగా ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. ఎక్కడా పెదవి విప్పిన దాఖలాలు లేవు. పార్టీ వ్యవహారాలను కూడా పెద్దగా పట్టించుకోలేదు. రెండు రోజుల కిందట, పార్టీ ముఖ్యులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలూ ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నిక, టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్పు వంటి విషయాలు చర్చించారు.  ఆ సందర్భంగా చేసిన ప్రసంగంలో కూడా కేసీఆర్ ఎక్కడా బీజేపీయేతర పార్టీల ఐక్యతా ప్రయత్నాల గురించి పన్నెత్తి మాట్లాడలేదు. అంటే జాతీయ స్థాయిలో నాన్ బీజేపీ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలన్న తన ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పకనే చెప్పారు.ఈ నెల చివరిలో జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించేశారు. ఇప్పుడు కేసీఆర్ ఆరంభించి వదిలేసిన పనిని మమతా బెనర్జీ తలకెత్తుకున్నారు.రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీయేతర పార్టీల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలనీ, ఇందుకు అభ్యర్థిని ఖరారు చేయడానికి హస్తినలో కలుద్దామనీ దేశ వ్యాప్తంగా ఉన్న నాన్ బీజేపీ పార్టీల నేతలకు లేఖలు రాశారు. ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా మొత్తం 22 మంది నాయకులకు ఆమె లేఖలు రాశారు. సమావేశ తేదీని కూడా జూన్ 15గా ఖరారు చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, పంజాబ్ సీఎంలు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా సహా పలు పార్టీల అధినేతలకు మమతా బెనర్జీ లేఖలు రాశారు. ఇంత వరకూ అంతా బానే ఉంది. తాను ఒక అడుగు ముందుకు వేసినప్పుడు అడుగు కలపడానికి విముఖత చూపిన మమతా బెనర్జీ ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ జూన్ 15 నాటి సమావేశానికి హాజరౌతారా అన్న అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.   ఇదొక అంది వచ్చిన అవకాశంగా భావించి తాను ఆమోదించే వ్యక్తినే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎంపికయ్యేలా పట్టుబట్టి జాతీయ స్థాయి రాజకీయాలలో తన ప్రాముఖ్యతను చాటుకునే ప్రయత్నం చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా సమావేశం ఏర్పాటు చేసింది ఎవరైతేనేం.. బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికలో గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని నిలిపే ప్రయత్నాలలో భాగస్వామి అవ్వడం ద్వారా తాను కొత్తగా ఏర్పాటు చేయబోయే భారాస పార్టీకి జాతీయ స్థాయిలో సానుకూలత వచ్చేలా వ్యవహరిస్తారా అన్నది రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి గట్టి ఝలక్ ఇవ్వాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారన్న విషయం ఆయన పార్టీ ముఖ్యులతోఇటీవల నిర్వహించిన  అత్యవసర సమావేశంలో మాట్లాడిన దానిని బట్టి అవగతమౌతోంది. అయితే అందుకు తాను చేసిన ప్రయత్నాలు కలిసి రాలేదు. దీంతో కేసీఆర్ ఒకింత నిరుత్సాహానికి గురయ్యారనడంలో సందేహం లేదు. ఆయన గత కొంత కాలంగా మౌనం వహించడమే ఇందుకు కారణం. అయితే ఇప్పుడు కేసీఆర్ ఎక్కడైతే ఆపేశారో సరిగ్గా అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేసీఆర్ ఏదైతే చేయాలనుకున్నారో అదే చేయడానికి ఒక అడుగు ముందుకు వేశారు. తాను ప్రయత్నించినప్పుడు ఎందుకు కలిసి రాలేదంటూ కేసీఆర్ ఈ సమావేశానికి దూరంగా ఉండిపోతారా? లేక ఏదైనా తాను ఆరంభించిన పనిని మమత ముందుకు తీసుకెళుతున్నారు కనుక కలిసి అడుగేస్తారా? అన్న దానిపై పరిశీలకులు పలు రకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు.ఏది ఏమైనా బీజేపీయేతర పార్టీల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం తాను ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీకి దేశ వ్యాప్తంగా ఒక సానుకూలత వచ్చేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారని తెరాస వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు కానీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కానీ మమత ఆహ్వానం పంపలేదు. సరే తెలుగుదేశం పార్టీకి అయితే ఎలక్టోరల్ కాలేజీలో ఓట్లు బహుస్వల్పం, అలాగే ఆ పార్టీ అధినేత జాతీయ రాజకీయాలపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. ఆయన దృష్టి అంతా రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపైనే ఉంది.ఇక జగన్ ను జాతీయ స్థాయిలో నాయకుడిగా ఏ పార్టీ గుర్తించడం లేదు. అంతే కాకుండా జగన్ పార్టీని అంటే వైసీపీని బీజేపీ మిత్రపక్షంగానే ఇతర పార్టీలన్నీ  పరిగణిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి..కాదు కాదు దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీ, మోడీ సర్కార్ విధానాలను గట్టిగా ప్రతిఘటిస్తున్న ఏకైక నేతగా ఇప్పటికే తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు కొనసాగాలన్నా, జాతీయ పార్టీ ఏర్పాటుకు సానుకూలత ఏర్పడాలన్నా మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్నది పరిశీలకుల అభిప్రాయం. అయితే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. చివరికి కేసీఆర్ నిర్ణయం ఏమిటన్నది ఆయన చెబుతేనే తెలుస్తుంది. మమత ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ జూన్ 15న ఢిల్లీలో జరిగే బీజేపీయేతర పార్టీల సమావేశానికి వెళతారా లేదా అన్న ఉత్కంఠ ఆయన తన నిర్ణయం వెలువరించే వరకూ కొనసాగుతూనే ఉంటుంది.

Related Posts