తిరుపతి, జూన్ 14,
చిత్తూరులో అధికార పార్టీ కేడర్… ద్వితీయ శ్రేణి నాయకులు మెత్త పడ్డారా..? మునుపటి జోష్ లేకపోవడానికి కారణం ఏంటి? ఏదైనా కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం ఆలస్యం… ఓ రేంజ్‌లో హడావిడి చేసే నాయకులు ఇప్పుడు ఏమైపోయారు? ప్రస్తుతం ఆజిల్లాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఏ పార్టీకి అయినా కేడర్‌లకే బలం. ఇక నాయకుడు ఎక్కడ ఉంటే కార్యకర్తలు ఆయన వెంట తిరుగుతుంటారు. ఎక్కడైనా జరిగేది అదే..! కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గతంలో ఏ చిన్న కార్యక్రమం నిర్వహించినా జాతరను తలపించేలా ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు వాలిపోయేవారు. కానీ ఇప్పుడు జిల్లాలోని అదికారపార్టీలో అలాంటి వారు కనిపించడం లేదు. దివంగత నేత జయంతి, వర్థంతి, సీఎం జన్మదినం, పార్టీ అవిర్భావ దినోత్సవాలు .. ఇలా అనేక కార్యక్రమాల్లో హడవుడి చేసే వైసీపీ శ్రేణులు ఇప్పుడు మౌనంగా ఉండిపోతున్నాయట.. మొదటి నుంచి జెండా భుజానికెత్తుకొని పరుగులు పెట్టిన నేతలను కాదని… కొత్తగా పార్టీలో చేరిన వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని కొద్దిమంది గుర్రుగా ఉన్నారు. మరోవైపు పదవులు పొందిన నాయకులు కూడా అలంకార ప్రాయాని తప్ప అధికారం లేని పదవులు ఎందుకని మదనపడిపోతున్నారట. ఇక చిన్నచిన్న పనులు కావడం లేదని, అత్యవసరం అని ఫోన్ చేసినా పట్టించుకోకుండా ఉన్నారని కార్యకర్తలు తెగ ఆవేదన చెందుతున్నారట, జిల్లాలో మొత్తం పరిస్థితి ఇలానే ఉన్నా నగరి, జిడి నెల్లూరు, సత్యవేడు, చిత్తూరు, తిరుపతి, పలమనేరు, పీలేరు, చంద్రగిరిలో దాని పాళ్లు మరింత ఎక్కువగా ఉందనేది టాయ్. రెండున్నరేళ్ల కాలంలో సగం కరోనాకు పోతే… ఇప్పుడు పరిస్థితులు మెరుగైనా… పార్టీలో తమ పరిస్థితులు బాగాలేవని కొందరు సన్నిహితుల వద్ద కడుపు చించుకున్నట్టు సమాచారం. చాలామంది ద్వితీయ శ్రేణి నేతలకు పదవులు దక్కలేదని గుర్రుగా ఉంటే… కార్యకర్తలైతే ఇటు నేతల వద్ద తమకు విలువే లేకుండా పోయిందని, ఆవేదన చెందుతున్నారట. ఏ చిన్న కార్యక్రమం జరిగినా నేతల చుట్టూ ఉండే కేడర్… ఇప్పుడు లీడర్ల మీద కోపంతో దూరం దూరం అన్నట్టు ఉంటున్నారన్నది ప్రధానంగా వినిపిస్తున్న టాక్. ఇటీవల నగరి, జీడీ నెల్లూరులో మంత్రి రోజా, నారాయణ స్వామిల పర్యటనలో కేడర్ తక్కువ, అధికారులు ఎక్కువగా కనిపించారని చెప్పుకుంటున్నారు. ఇటు తిరుపతిలో గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన వెంట… కార్పొరేటర్లు, మేయర్లు, అధికారులు తప్ప ఎవరు లేరని చెప్పుకుంటున్నారు. చిత్తూరులో కేడర్ మొత్తం ఎమ్మెల్యేతో కాకుండా మరోనేత విజయనందారెడ్డి వెంట వెళుతున్నారట. సత్యవేడులోనూ సేమ్ సీన్. ఇలా చెప్పుకుంటే ప్రతినియోజకవర్గంలో కేడర్ నేతలకు షాక్ ఇస్తూ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. వచ్చిన కొద్దిమంది కూడా ఇలా కనిపించి ఓ నమస్కారం పెట్టి వెళ్లిపోతున్నారట. మరి ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు పార్టీ ఏం చేస్తుందన్నది చూడాలి.