అనంతపురం, జూన్ 14,
కరోనా వల్ల చితికిపోయిన నేతన్నలు ఇప్పుడిప్పుడే కోలుకుంటూ తిరిగి పనుల్లో కుదురుకుంటున్నారు. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా… వీరికి విద్యుత్ ఛార్జీలు పెంపు గుదిబండగా మారాయి. పరిస్థితి ఇలానే ఉంటే రైతుల్లానే మేము కూడా ఆత్మహత్య చేసుకోవాలంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు నేత కార్మికులు. పరిశ్రమల కేటగిరీలోకి మార్చి అదనపు బిల్లులు వస్తూలు చేస్తుండటంతో.. నేత కార్మికుల విద్యుత్ ఛార్జీలు రెండు రెట్లు పెరిగాయి. ఈడీ ఛార్జీల పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తుండటంతో నష్టపోతున్నామని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పవర్ లూమ్ కార్మికులను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. అధిక ఛార్జీలు వారిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇక్కడి విద్యుత్ అధికారులు వీరిపై ఎడాపెడా ఛార్జీలు వేస్తున్నారు. పనులు చేయలేక ఎక్కువ మంది కార్మికులు వృత్తులు వదిలేసి వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారు నియోజకవర్గ పరిధిలో మరమగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికుల కుటుంబాలపై విద్యుత్ ఛార్జీల పెంపు తీవ్ర ప్రభావం చూపుతోంది. నగరి నియోజకవర్గంతో పాటు నారాయణవనం మండలాల్లో దాదాపు 16 వేల కుటుంబాలు మరమగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. గత రెండేళ్లుగా కరోనా వల్ల వ్యాపారం లేక నష్టపోయారు. సాధారణ పరిస్థితులు నెలకొని.. వ్యాపారాలు పుంజుకొంటున్న సమయంలో కరెంటు ఛార్జీలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని నేతన్నలు వాపోతున్నారు.మరమగ్గాలపై కుటుంబం మొత్తం నెల రోజుల పాటు కష్టపడితే 10వేల రూపాయలు ఆదాయం వస్తుందని.. దానిలో 3, 4వేల రూపాయలు విద్యుత్ ఛార్జీలకే చెల్లించాల్సి వస్తోందని నేత కార్మికులు వాపోతున్నారు. అధికారంలోకి వస్తే 500 యూనిట్ల వరకు ఉచితంగా మరమగ్గాలకు విద్యుత్ సరఫరా చేస్తామన్న హామీ అమలు చేయడం మాట అటుంచి ఛార్జీలు పెంచారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమగ్గాలకు విద్యుత్‌పై గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీ సైతం తొలగించారని వాపోతున్నారు. ఈడీ ఛార్జీల పేరుతో తమ కడుపు కొడుతున్నారని వాపోతున్నారు.మరమగ్గాలపై యూనిట్ కు 94 పైసలు పెంచడంతో గతంతో పోలిస్తే రెట్టింపు కరెంటు బిల్లులు వస్తున్నాయని నేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన బాట పడుతున్నారు. ఇక ఇతర రాష్ట్రాల్లో పవర్ లూమ్ కార్మికులకు ఆయా ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. తమిళనాడులో 50 శాతం ఉచితంగా అక్కడి ప్రభుత్వం ఇస్తోంది. అలాగే సిరిసిల్ల ప్రాంతంలో పవర్ లూం రాయితీలిస్తోంది. కేరళలో కూడా పవర్ లూమ్ కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటోంది. అయితే మన రాష్ట్రంలోనే ఈ విధంగా కార్మికులపై వివిధ రకాల భారాలు మోపుతురని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.