తిరుమల, జూన్ 14,
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారు ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేవుడు. భక్తుల నుంచి కానుకలు, విరాళాల రూపంలో శ్రీవారికి వందల కోట్లు చేరుతున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా శ్రీవారి హుండీ ఆదాయం ఆశించిన మేరకు రాలేదు. దాతల సహకారం మాత్రం టీటీడీకి భారీగానే లభించింది. కోవిడ్ సమయంలోనూ టీటీడీ కార్యక్రమాలకు రూ.వందల కోట్ల విరాళాలు లభించాయి. టీటీడీ పథకాలకు 2019లో రూ.308 కోట్ల విరాళాలు వచ్చాయి. 2020లో రూ.232 కోట్లు, 2021లో రూ.564 కోట్ల విరాళాలు టీటీడీ ఖజానాకు చేరాయి.పథకాల వారీగా గమనిస్తే.. గత మూడేళ్లలో అన్నప్రసాదం పథకానికి రూ.390 కోట్లను భక్తులు విరాళంగా సమర్పించారు. అటు ప్రాణదాన పథకానికి రూ.160 కోట్లు, గోసంరక్షణ పథకానికి రూ.62 కోట్లు, బర్డ్ ట్రస్ట్ పథకానికి రూ.41 కోట్లు వచ్చి చేరాయి. వెంకటేశ్వర సర్వ శ్రేయా ట్రస్టుకు రూ.29 కోట్లు, విద్యాదానం ట్రస్టుకు రూ.36 కోట్లు, వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.26 కోట్లు, శంకర నేత్రాలయ ట్రస్టుకు రూ.5 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు రూ.350 కోట్లను భక్తులు విరాళంగా అందించారు. కోవిడ్ సమయంలో హుండీ ఆదాయం పడిపోయినా టీటీడీ ట్రస్టుల పథకాలకు రూ.1100 కోట్ల మేర భక్తులు టీటీడీకి విరాళంగా సమర్పించారు.తాజాగా తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళాలు అందాయి. ఆదివారం నాడు టీటీడీలోని ట్రస్ట్‌లకు వివిధ సంస్థల నుండి రూ.3.20 కోట్లు విరాళంగా అందింది. హైదరాబాద్ ఆర్ఎస్ బ్రదర్స్ గ్రూప్స్ సంస్థ యాజమాన్యం వెంకటేశ్వర్లు, ప్రసాదరావు, రాజమౌళి ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.1.20 కోట్లు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.60 లక్షలను విరాళంగా అందించారు.