విజయవాడ, జూన్ 14,
రాజకీయాల్లో ఏది జరిగినా విచిత్రమే. వ్యక్తిగతంగా సన్నిహితులు, స్నేహితులు అయిన వారు విరుద్ధమైన పార్టీలో ఉన్నప్పటికీ వారి కలయిక ఎప్పటికప్పుడు చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీల కతీతంగా రాజకీయ నేతలు తమ స్నేహాలు కొనసాగిస్తారు. అందులో వంగవీటి రాధా ఒకరు. ఆయనకు మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంచి స్నేహితులు. వీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ తరచూ కలుస్తుంటారు. వంగవీటి రాధా, వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ లో కలిసారు. ఇద్దరు కలసి ఒకే కారులో వెళ్లి ఏకాంతంగా చర్చించారు. వల్లభనేని వంశీ టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో గ్రూపుల మధ్య ఇబ్బంది పడుతున్నారు. వంగవీటి రాధా గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. మరి వీరిద్దరి కలయిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీలోకి వల్లభనేనిని వంగవీటి ఆహ్వానించారా? లేక వైసీపీలోకి వంగవీటిని వల్లభనేని రావాలని కోరారా? అన్న చర్చ జరుగుతోంది. వల్లభనేని వంశీ ఇక టీడీపీకి వెళ్లే అవకాశాలు లేవు. ఎందుకంటే నారా చంద్రబాబు కుటుంబంపై వల్లభనేని వంశీ అన్న మాటలతో ఆ పార్టీకి పూర్తిగా దూరమయినట్లే, వంగవీటి రాధా విషయంలోనే కొంత చర్చ జరుగుతుంది. ఇటీవల మహానాడుకు కూడా వంగవీటి రాధా దూరంగా ఉన్నారు. జగన్ కూడా అభ్యర్థులను మార్చాలని భావిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లాది విష‌్ణును తప్పిస్తారన్న ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లోనే విష్ణు అతి కొద్ది ఓట్లతోనే విజయం సాధించారు. దీంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ ను వంగవీటి రాధాకు ఇచ్చేలా కొడాలి నాని, వల్లభనేనివంశీ పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పిస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం మధ్య వీరి కలయిక రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. కాపు సామాజికవర్గం ఓట్లకు దూరమవుతున్న వైసీపీకి వంగవీటి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కొంత ప్లస్ అవుతుందని కూడా లెక్కలు వేస్తున్నారు. మరి వీరి మధ్య జరిగిన చర్చ ఏంటన్నది బయటకు తెలియలేదు. కానీ త్వరలోనే ఒక ప్రకటన వెలువడుతుందన్న టాక్ మాత్రం రాధా శిబిరం నుంచి వినపడుతుంది.