YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆత్మకూరు అనైక్యతతో టెన్షన్

ఆత్మకూరు అనైక్యతతో టెన్షన్

నెల్లూరు, జూన్ 15,
వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి అయింది. ఈ మూడేళ్ల ఆయన పరిపాలన.. మూడునాళ్ల ముచ్చటగానే సాగిందనే ముచ్చట రాష్ట్ర ప్రజల్లో బలంగా నాటుకోందా? ఈ విషయం సీఎం జగన్‌కి కూడా తెలిసిపోయిందా? అందుకే ఇటీవల పార్టీ నిర్వహించిన వర్క్‌షాప్‌లో.. పలువురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని సీఎం జగన్ క్లియర్ కట్‌గా చెప్పేశారా? ఆ క్రమంలోనే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఏడుగురు మంత్రులతోపాటు ఏడుగురు ఎమ్మెల్యేలను రంగంలోకి దించి.. సదరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు వారిని  ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించారా? అంటే సీఎం క్యాంప్ కార్యాలయం తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి మాత్రం అవుననే సమాధానం వస్తోందీ. మేకపాటి ఫ్యామిలీకి నెల్లూరు జిల్లాలోనే మంచి గుడ్ విల్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ క్రమంలోనే మేకపాటి రాజమోహన్ రెడ్డిని.. పలుమార్లు లోక్‌సభ సభ్యుడిగా నెల్లూరు ప్రజలు గెలిపించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఆయన కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా తండ్రిలా అంతా సాఫ్ట్ అన్న విషయం కూడా విధితమే. 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గౌతమ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత  అంటే 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఇదే నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. జగన్ కేబినెట్‌లో అత్యంత కీలకమైన పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యేగా ఉన్నా.. మంత్రిగా ఉన్నా.. జగన్ పార్టీ గౌరవ మర్యాదలు ఎక్కడా తగ్గకుండా చూసుకొన్న అతి కొద్ది మంది ఎమ్మెల్యేల్లో మొదటి స్థానంలో గౌతమ్ రెడ్డి ఉంటారనివైసీపీ వర్గీయులు చెప్పుకుంటారు. అలాంటి గౌతమ్ రెడ్డి.. ఆకస్మిక మరణం.. జగన్ పార్టీకి గట్టి దెబ్బేనని.. ఆ పార్టీలో  ఓ చర్చ అయితే బలంగా ఉందట.వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. గౌతమ్ రెడ్డి చాలా డిగ్నిఫైడ్‌గా ఉండేవారని చెబుతుంటారు. అంతేకాదు.. వైసీపీలో మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, పేర్నినాని తాజా మంత్రి  ఆర్కే రోజాల వ్యవహారశైలికి గౌతమ్ రెడ్డి వ్యవహార శైలికి నక్కకూ నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంటుందనే ఓ చర్చ కూడా పార్టీలో గట్టిగానే సాగుతోంది.అలాంటి మేకపాటి ఫ్యామిలీ నుంచి  విక్రమ్ రెడ్డి ఈ ఉప ఎన్నికల బరిలో నిలిస్తే.. ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని వైసీపీయే కాక విపక్షాలు కూడా భావిస్తున్నాయి. మరి అలాంటి వేళ.. ఇంత మంది మంత్రులు, ఇంత మంది ఎమ్మెల్యేలను ఈ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ ఎందుకు దింపారని వైసీపీ నేతల్లోనే కాదు.. విపక్ష తెలుగుదేశంలోనూ సందేహం వ్యక్తం అవుతోంది. పైగా ప్రధాన విపక్షం పోటీలో లేదు. పోటీలో ఉన్న బీజేపీ ఉనికి జిల్లాలో నామమాత్రమే. అయినా ఆత్మకూరు ఉప ఎన్నిక విజయంపై జగన్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారన్న ప్రశ్నకు   ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని... జగన్ కు బాగానే అర్థమైందని అందుకే.. ఇంతలా.. మంది మార్బలాన్ని  ఈ ఉప ఎన్నికకు మోహరించారని పార్టీ వర్గీయులే అంటున్నారు. మరోవైపు మేకపాటి ఫ్యామిలీపై అభిమానం ఉన్నా.. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటు కాస్తా.. బీజేపీకి పడితే.. ఫలితం తారుమారు అయి.. పొరుగున ఉన్న తెలంగాణలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు లాంటి సీన్ రిపిట్ అయితే.. పరువు పెన్నానదిలో కలుస్తుందని జగన్ భయపడుతున్నట్లు చెబుతున్నారు. ఇంకోవైపు  వైసీపీలో లీడర్ నుంచి కేడర్ వరకు   అనైక్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తోందట. ఇది నెల్లూరు జిల్లాలో అయితే ఈ అనైక్యత ముదిరి పాకన పడిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిందరినీ ఏక తాటిపైకీ తీసుకు వచ్చి..  ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అటు మంత్రులకు, ఇటు ఎమ్మెల్యేలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్‌ విధించారని సమాచారం. దీంతో ఇన్ చార్జ్‌లుగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. తమ టాలెంట్ జగన్‌కి చూపించాలని ఉబలాటపడుతున్నారట. మరి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల చిత్తంలో ఏముందనేది మాత్రం అర్థం కావడం లేదని ఫ్యాన్ పార్టీ నేతల్లో ఓ గుసగుస మొదలైంది. 

Related Posts