ఏలూరు, జూన్ 15,
ఏరువాక పున్నమి సమయానికి రుతుపవనాలు బలపడి, వర్షాలు మొదలవుతాయి. దుక్కిదున్ని పొలం పనులను మొదలుపెట్టడానికి ఇది అనువైన సమయం. అంతేకాదు! అందరూ ఒకేసారి పనులు మొదలుపెడితే వ్యవసాయం కూడా క్రమ పద్ధతిలో ఉంటుంది. అందుకోసమే… జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి రోజున వ్యవసాయ పనులను మొదలు పెడతారు. ఒక రకంగా ఏరువాక వ్యవసాయానికి ఉగాది లాంటిది. కర్షకులకు క్యాలెండర్ ఇది!ఏరువాక అంటేనే దుక్కి మొదలుపెట్టడం అని అర్థం. ఈ ప్రత్యేకమైన రోజును ఓ వేడుకలా నిర్వహిస్తారు రైతులు. ఎద్దులను శుభ్రం చేసి, వాటిని చక్కగా అలంకరిస్తారు. పొంగలిని నైవేద్యంగా పెడతారు. మరో విశేషం ఏమిటంటే… గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు ఎడ్ల పందేలు కూడా నిర్వహిస్తారు. ఈ రోజు ఎద్దులతో తొలి దుక్కి దున్నించడంతో పాటు.. ఆ సమయంలో, తాము కూడా కాడి పడతారు రైతులు. తమ కష్టసుఖాలలో తోడుండే మూగజీవుల పట్ల తమ గౌరవాన్ని తెలియచేసే ఆచారమది! అటువంటి ఏరువాక ఈ సారి ఏపీలో అందునా గోదావరి జిల్లాల్లో ఎటువంటి సందడీ లేకుండా సాదాసీదాగా సాగిపోతోంది. జగన్ ప్రభుత్వ వ్యవసాయ విధానాల కారణంగా అన్నదాతకు సాగు బరువుగా మారింది. అందుకు నిరసనగా తూర్పుగోదావరిలో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారు. దీంతో ఏరువాక సందడే కనిపించడం లేదు. రైతుల ఉగాది ఉషస్పు లేకుండా గడిచిపోయింది.