ముంబై, జూన్ 15,
రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ ముందు వరకూ ఉత్కంఠ రేపినా చివరకు వచ్చేసరికి ఏకపక్షంగా మారిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. విపక్షాల అనైక్యత కారణంగా బీజేపీ అభ్యర్థి ఎన్నిక లాంఛనమే అనే పరిస్థితి ఏర్పడింది. సరిగ్గాఈ కారణంగానే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా అందరికీ ఆమోదయోగ్యమైన శరద్ పవార్ పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారన్నది విశ్లేషకుల మాట. దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తొలి నుంచీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్ అయితే ఎవరికీ అభ్యంతరం ఉండదన్న అభిప్రాయమే వ్యక్తం అవుతూ వచ్చింది. అయితే విపక్షాల ఐక్యతకు చొరవ చూపే విషయంలో వివిధ పార్టీల నాయకల మధ్య సయోధ్య లేకపోవడంతో.. అది సాకారం కాలేదు.ఇప్పుడు తీరా రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చొరవ తీసుకుని బీజేపీ యేతర పక్షాల నేతల సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ అప్పటికే ఆలస్యమైంది. మమతా బెనర్జీ కూడా బీజేపీయేతర పక్షాల నేతలకు ఆహ్వానం పంపే విషయంలో తనదైన శైలిని అనుసరించారు. సోనియాకు ఆహ్వానం పంపిన ఆమె కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించలేదు. మరో వైపు కాంగ్రెస్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక విషయమై పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సోనియా ప్రతినిథిగా మల్లిఖార్జున ఖర్గేకు బాధ్యతలు అప్పగించింది. అందరి కంటే ముందు ఈ పని కోసం కాలికి బలపం కట్టుకు తిరిగిన కేసీఆర్.. తన ప్రయత్నాలకు బీజేపీ యేతర పార్టీల నుంచి సానుకూలత రాకపోవడంతో కినుక వహించి మౌనం వహించారు.ఇలా విపక్షాల అనైక్యత కారణంగా అభ్యర్థి ఎంపిక ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి రేసులో తాను లేనంటూ శరద్ పవార్ మంగళవారం విస్పష్ట ప్రకటన చేశారు. దీంతో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరన్న విషయంలో మళ్లీ సస్పెన్స్ నెలకొంది. తొలుత శరద్ పవార్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ తెరమీదకు తీసుకువచ్చింది. రాజకీయాలలో సీనియర్ అయిన శరద్ యాదవ్ అభ్యర్థిత్వం పట్ల ఏ బీజేపీయేతర పార్టీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు.అయితే పార్టీలుఈ విషయాన్నిప్రకటించే విషయంలో జరిగిన జాప్యం, అలాగే వైసీపీ, బీజేడీ వంటి పార్టీలు బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తాయన్న స్పష్టత రావడంతో శరద్ పవార్ తాను రేసులో లేననీ, పోటీకి సుముఖంగా లేననీ ప్రకటించేశారు. ప్రస్తుత సినేరియాలో విపక్షాలకు ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైనన్ని ఓట్లు ఎలక్టోరల్ కాలేజీలో లేవు. దీంతో గెలిచే అవకాశంలేని పోటీలో దిగడమెందుకన్నభావనతోనే శరద్ పవార్ రేసు నుంచి తప్పుకున్నారని పరిశీలకులువిశ్లేషిస్తున్నారు.