శ్రీనగర్ జూన్ 15
జమ్ముకశ్మీర్‌లో ముష్కరుల ఏరివేత కొనసాగుతున్నది. షోపియాన్ జిల్లాలోని కంజియులర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. కంజియులర్ ప్రాంతంలో భద్రతాబలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని, ఈ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పలకు తెగబడ్డారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని వెల్లడించారు.వారిని లష్కరే తొయీబాకు చెందినవారని, వారిలో ఒకరు షోపియాన్‌కు చెందిన జాన్ మహ్మద్ లోన్‌గా గుర్తించామన్నారు. అతడు జూన్ 2వతేదీన కుల్గాం జిల్లాలో బ్యాంకు మేనేజరు విజయ్ కుమార్ ను హతమార్చిన కేసులో నిందితుడని వెల్లడించారు. మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉందన్నారు. ఘటనా స్థలంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు.కాగా, ముంగళవారం తెల్లవారుజామున శ్రీనగర్‌లోని బెమినా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. వారిలో ఒకరు షోపియాన్ జిల్లాకు చెందినవారు.