YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హస్తినలో రాష్ట్రపతి ఎన్నిక వేడి ఏకగ్రీవం కోసం కమలం కసరత్తు

హస్తినలో రాష్ట్రపతి ఎన్నిక వేడి ఏకగ్రీవం కోసం కమలం కసరత్తు

న్యూఢిల్లీ,జూన్ 15,
రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుండటంతో దేశంలో రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు ఏకగ్రీవం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. అభ్యర్థి ఎంపిక కోసం విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బీజేపీ కూడా ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ప్రతిపాదించే అభ్యర్థికి.. అధికార పక్షం మద్దతు పలకనుందా? ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా భాజపా అగ్రనేత రాజ్నాథ్ సింగ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా?… కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇలాంటి ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి.రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఓవైపు మమతా బెనర్జీ విపక్షాల ఐక్యతకు ప్రయత్నాలు చేస్తుంటే.. అధికార బీజేపీ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏకాభిప్రాయం తీసుకొచ్చే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్‌కు భాజపా అప్పగించింది. ఆయన ఈ విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేతో రాజ్‌నాథ్ మాట్లాడారు.ప్రధాని మోదీ తమ అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారని రాజ్నాథ్ తనతో చెప్పినట్లు ఖర్గే వెల్లడించారు. ప్రభుత్వ ప్రతిపాదనలు ఏంటని విషయాన్ని తాను అడిగినట్లు చెప్పారు. అభ్యర్థిని ఎవరిని నిలబెడుతున్నారని అడిగానని తెలిపారు. అయితే, తనతో సంప్రదింపులు కొనసాగించే విషయంపై రాజ్‌నాథ్ స్పష్టతనివ్వలేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. వివాదాలు లేని అభ్యర్థి పేరును విపక్షాలు ప్రతిపాదిస్తే అందుకు ప్రభుత్వం మద్దతిస్తుందా? అని ప్రశ్నించారు. ఏకగ్రీవంగా అభ్యర్థిని గెలిపించే అవకాశం ఉందా? అని అడిగారు.మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు సమావేశమవ్వాలని పిలుపునిచ్చిన బంగాల్ సీఎం మమతకు ఆదిలోనే చుక్కెదురైంది. భేటీకి టీఆర్ఎస్, ఆప్ గైర్హాజరు కానున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ఈ భేటీకి వస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌.. భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. మరోవైపు, అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే విపక్షాలకు మద్దతు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసినట్లు సమాచారం. బిజు జనతా దళ్, శిరోమణి అకాలీదళ్ సైతం ఈ మీటింగ్కు దూరంగా ఉండనున్నాయి. తమకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ అందినా భేటీకి దూరంగా ఉండేవాళ్లమని ఎంఐఎం వెల్లడించింది. కాంగ్రెస్ కూడా ఈ సమావేశంలో భాగమవడమే ఇందుకు కారణమని తెలిపింది.జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు జులై 21న వెలువడతాయి. ఈ నేపథ్యంలో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు మమత కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికలపై చర్చించేందుకు.. 22 మంది రాజకీయ పార్టీల నేతలకు మమత ఆహ్వానాలు పలికారు. ఇందులో ఏడుగురు ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే, భేటీకి ముందే 4 పార్టీలు గైర్హాజరు అవుతున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది.

Related Posts