విశాఖపట్టణం, జూన్ 15,
గ్రూప్ రాజకీయాల ఉక్కపోత భరించలేక ఆ ఎమ్మెల్యే రాజీనామా అస్త్రం సంధించారా? అసలు ఉద్దేశాలు పసిగట్టిన అధిష్ఠానం విరుగుడు మంత్రం వేసిందా? విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు ‘అమ్మ.. వాసుపల్లి’ అని ఆశ్చర్యపోతున్నాయా? ముసళ్ల పండగ ముందుంది అని వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది ఎవరు? ఏమా కథా?రాజకీయాలు అంటేనే గ్రూపులు ఉంటాయి. అందులోనూ అధికారపార్టీ అయితే ఆ సమస్య మరింత జఠిలం. రెండు, మూడు కూటములు ఉంటేనే భరించడం కష్టం. అటువంటిది విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 10వరకు గ్రూపులు ఏర్పడ్డాయి. టీడీపీలో గెలిచి వైసీపీ పంచన చేరిన రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి ఎంట్రీతో ఇక్కడ పాలిటిక్స్ హీటెక్కడం మొదలైంది. ఎమ్మెల్యే అనుచరులు, ముఖ్య నాయకులు పార్టీలో చేరగా.. కొత్తవాళ్లతో సర్దుకుపోవడం ఆవిర్భావం నుంచి వైసీపీ జెండా మోసిన వాళ్లకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి టిక్కెట్ ఆశించి రంగంలోకి దిగారు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్. ఇది ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు మింగుడు పడటం లేదటవాసుపల్లి వైసీపీలో చేరే సమయానికే నియోజకవర్గంలో పార్టీకి ఇంఛార్జ్ ఉన్నారు. వాసుపల్లి ఎంట్రీతో వర్గపోరు రాజుకుంది. గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే వాసుపల్లి చేసిన విమర్శలను వైసీపీ శ్రేణులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాయట. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో సీతంరాజు సుధాకర్ మరింత యాక్టివేట్ అయ్యారు. ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న వర్గాలు అంతర్గతంగా ఒకే తాటిపైకి వచ్చే ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఎమ్మెల్యే తనకు తాను స్ట్రాంగ్ పాకెట్స్ అని భావిస్తున్నచోట ప్రత్యర్ధులు పాగా వెయ్యడం వాసుపల్లికి ఆవేదన కలిగించింది. ఉమ్మడి విశాఖ జిల్లాల వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి దగ్గరకు మొదటి విడతలోనే దక్షిణ నియోజకవర్గ పంచాయితీ చేరింది.వాసుపల్లి, సుధాకర్ వర్గాలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇరువర్గాల వాదనలు అదుపు తప్పి ఘర్షణ పడే స్థాయికి వెళ్లడంతో బాల్‌ను సీఎం కోర్టులోకి గెంటేశారు సుబ్బారెడ్డి. ఈ చర్యను ఊహించని వాసుపల్లి అప్పటి నుంచి పార్టీతో అంటీ ముట్టనట్టు వ్యవహరించడం ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారనే.. ప్రచారం షికారు చేసింది. ఇలాంటి తరుణంలో హైకమాండ్ దగ్గర తన విలువ ఎంతో తెలుసుకోవాలని భావించారో ఏమో ఎమ్మెల్యే వాసుపల్లి రాజీనామా అస్త్రం సంధించారు. అనధికారికంగా చేపట్టిన కోఆర్డినేటర్ పదవిని వదులు కుంటున్నట్టు ఆయన ప్రకటించడం కలకలంగా మారింది. ఏకంగా వైవీ సుబ్బారెడ్డిని కోట్ చేస్తూ ఆయనకే రాజీనామా లేఖను పంపారు. దీన్ని మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదని.. ఎలాంటి నిర్ణయానికైనా సిద్దంగా ఉన్నాననీ లేఖ సంధించారు. ఆ లేఖతో టీడీపీకి వాసుపల్లి టచ్‌లో ఉన్నారనే ఊహాగానాలు బలపడ్డాయి.ఇప్పటికే నరసాపురం, గన్నవరం సహా పలుచోట్ల వర్గ రాజకీయాలు నలుగుతుండగా.. ఎమ్మెల్యే వాసుపల్లి రాజీనామా వెనక ఆంతర్యం పసిగట్టిన అధినాయకత్వం రంగంలోకి దిగింది. సింగిల్ లీడర్ షిప్ మాత్రమే ఉండాలని.. పార్టీ కార్యకలాపాలు ఎమ్మెల్యే తప్ప ఇతరులు నిర్వహించవొద్దని ఆదేశించింది. హైకమాండ్ నుంచి క్లారిటీ వచ్చేయడంతో కలిసి వచ్చే నాయకత్వాన్ని వెంటబెట్టుకుని “గడపగడపకు” ప్రారంభించారు వాసుపల్లి. సీతంరాజు వర్గం అధినాయకత్వం ఆదేశాలను గౌరవిస్తూనే కొత్త ప్రయత్నాలు ప్రారంభించింది. రాజకీయల ఊసు ఎత్తకుండా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను విస్త్రతం చెయ్యడం మొదలు పెట్టింది. సాంకేతికంగా ఇవేవీ రాజకీయలతో సంబందం లేనట్టే కనిపించినా పెద్దఎత్తుగడ ఉందని ఎమ్మెల్యే వర్గం గ్రహించిందని భోగట్టాసీతంరాజు చేపట్టిన ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు అన్నీ బ్రాహ్మణ, నిరుపేదల లక్ష్యంగా జరుగుతున్నాయి. దక్షిణ నియోజకవర్గ పరిధిలో బ్రాహ్మణ, వైశ్య వర్గాల ఓటింగ్ సుమారు 27వేలు ఉంటుందని అంచనా. ఈ లెక్కన సర్వీస్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా ఎన్నికల నాటికి తనకంటూ కొంత బలం వస్తుందనేది సీతంరాజు వర్గం ఆలోచనగా ఉందట. టికెట్ కేటాయింపు సర్వేల ఆధారంగానే ఉంటుందని హైకమాండ్ చెప్పడంతో అడ్వాంటేజ్ పొందాలనేది ఎమ్మెల్యే వైరివర్గం ప్లాన్. అదే సమయంలో వాసుపల్లి డిఫెన్స్‌లో పడినట్టేనన్న వాదన వినిపిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో విశాఖ దక్షిణ వైసీపీ రాజకయాలు పసందుగా మారతాయని అనుకుంటున్నారట.