YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దావోస్ పర్యటనలో వ్యవ'సాయం'పై దృష్టి..

దావోస్ పర్యటనలో వ్యవ'సాయం'పై దృష్టి..

: - యూపీఎల్ గ్లోబల్ సీఈవోతో  చంద్రబాబు సమావేశం

రైతన్నకు ఉపకరించే ఉత్పత్తులు, ఉపకరణాల తయారీ సంస్థలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో దృష్టి పెట్టారు. భూమిలో నీటిని గ్రహించి, ఆ నీటిని కరువు సమయంలో తిరిగి విడుదల చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో రెండు వేల లీటర్ల నీటిని గ్రహించే సామర్థ్యం గల ఈ తరహా ఉత్పత్తులను యూపీఎల్ లిమిటెడ్ సంస్ధ తయారు చేస్తోంది. ఇది సాగునీటి వినియోగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకురానుంది. కరువును నియంత్రించేందుకు దోహదం చేయడమే కాకుండా, 30 శాతం నుంచి 40 శాతం వరకు ఉత్పాదకత పెంచగలదని అంచనా. అలాగే భారీ వర్షాల సమయంలో భూమిపై జల్లిన ఎరువులు కొట్టుకుపోయి వృథా కాకుండా సంరక్షించే మరో ఉత్పత్తిని సైతం యూపీఎల్ సంస్ధ రూపొందించింది. దీంతో 30 శాతం ఎరువుల వినియోగం తగ్గుతుందని చెబుతోంది. వ్యవసాయ ఉపకరణాలు, ఉత్పత్తులకు పేరుగాంచిన యూపీఎల్ సంస్ధ గ్లోబల్ సీఈవో జైషరోఫతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం భేటీ ఆయ్యారు. ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, సమర్థ నీటి నిర్వహణ చేపట్టడం, వ్యవసాయ వ్యయ భారాన్ని నియంత్రించడం, ఉత్పాదకత పెంచడం తమ సంస్థ లక్ష్యాలని ఈ సందర్భంగా జైషరోఫ ముఖ్యమంత్రికి వివరించారు. తైవాన్ సైనిక సహకారంతో డ్రోన్  టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను యూపీఎల్ సంస్థ ప్రతినిధులకు ముఖ్యమంత్రి  వివరించారు. ఏపీని ఒక పర్యాయం సందర్శించాలని, తమ ఉత్పత్తులకు ప్రయోగశాల చేసుకోవాలని సూచించారు.
అక్కడ స్మార్ట్ క్యాంపస్ ఇక్కడ స్మార్ట్ ఏపీ
నన్యాంగ్ టెక్నాలాజికల్ యూనివర్సీటీ ప్రసిడెంట్ సుబ్రా సురేష్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సింగపూర్‌లోని తమ వర్సీటీ క్యాంపస్‌ను స్మార్ట్ క్యాంపస్‌గా తీర్చి దిద్దుతున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే 60 శాతం ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. వర్సీటీలో అంతర్గత రవాణా యావత్తూ ఎలక్ట్రికల్ వాహనాలేనని, 35 శాతం ఇంధనం ఆదా ఆవుతోందని సుబ్రా సురేష్ వెల్లడించారు. తమ క్యాంపస్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్‌గా అభివర్ణించారు. నన్యాంగ్ క్యాంపస్‌ను సందర్శించాలని ముఖ్యమంత్రిని సుబ్రా సురేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని స్మార్ట్ రాష్ట్రంగా మార్చాలని భావిస్తున్నట్లు సుబ్రా సురేష్‌కు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ-ప్రగతి, రియల్ టైమ్ గవర్నెన్స్‌ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. 
బ్లాక్‌చైన్ టెక్నాలజీ సంస్ధ ఏర్పాటుకు కృషి 
దావోస్ పర్యటనలో చంద్రబాబు బ్లాక్ చైన్ టెక్నాలజీకి చెందిన ఎధేరియం వ్యవస్థాపకుడు జో లుబిన్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైనా విశ్వవిద్యాలయంలో బ్లాక్‌ైచె న్ టెక్నాలజీ సంస్థను ఎధేరియం-రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నెలకొల్పాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. భారతదేశంలో ఎక్కడా బ్లాక్ చైన్ టెక్నాలజీ కోర్సు లేదని, రాష్ట్రంలో ఏదైనా విద్యాలయాన్ని ఎంపిక చేసుకుని మూడు నెలల కోర్సు ప్రారంభించవచ్చని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వచ్చే వారం న్యూయార్క్‌లో పర్యటించినప్పుడు ఎధేరియం కార్యాలయాన్ని సందర్శిస్తారని ముఖ్యమంత్రి చెప్పారు.
హెచ్‌పీ త్రీడీ ప్రింటింగ్ హెడ్‌తో భేటీ
అలాగే హెచ్‌పీ త్రీడీ ప్రింటింగ్ హెడ్ స్టీఫెన్ నిగ్రోతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సంస్థ ప్రతినిధులు మెటల్ గేర్ వీల్ తయారీ, త్రీడీ ప్రింటింగ్ విధానంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. హెచ్‌పీ సంస్థ తమ సెంటర్లను ఏపీలో విరివిగా ఏర్పాటు చేసి ప్రజలకు త్రీడీ ప్రింటింగ్ అనుభూతిని తెలియజేయాలని ముఖ్యమంత్రి కోరారు. సీఎం ఆహ్వానం మేరకు రెండు నెలల్లో తన భారత పర్యటనలో భాగంగా అమరావతి వస్తానని స్టీఫెన్ చెప్పారు. ఏపీలో త్రీడీ ప్రింటింగ్ సెంటర్ ఏర్పాటు విషయమై హెచ్‌పీ భారత్ సీఈవోతో సంప్రదిస్తానని తెలిపారు. దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి బృందంతో మంత్రులు యనమల రావుకృష్ణుడు, నారా లోకేశ్, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్,  ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవో జాస్తి కృష్ణ కిశోర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యయా రాజ్, వ్యవసాయ సలహాదారు టి. విజయ్ కుమార్ ఉన్నారు.

Related Posts