YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జల రవాణకు రెగ్యులేటరీ అథారటీ పడవ ప్రమాదాలకు అడ్డుకట్టవేయండి : సీఎస్ ఆదేశం

 జల రవాణకు రెగ్యులేటరీ అథారటీ పడవ ప్రమాదాలకు అడ్డుకట్టవేయండి : సీఎస్ ఆదేశం

రాష్ట్రంలో జల  రవాణా కోసం ప్రత్యేక రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను తక్షణమే రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో బోటు ప్రమాదాల నివారణపై సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న బోటు ప్రమాదాలపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఇకపై రాష్ట్రంలో బోటు ప్రమాదాలకు అడ్డుకట్టవేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇందుకోసం జలవనరులు, పోర్టు, టూరిజం, పోలీసు, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు జల రవాణా జరిగే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఆయా బోట్లను తనిఖీ చేయాలన్నారు. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేయాలన్నారు. బోట్లలో లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. లైసెన్సులు, రిజిస్ట్రేషన్ కాపీలో అందరికీ కనిపించేలా బోట్లలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైవర్లకు శిక్ష ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. ముఖ్యంగా రాష్ట్రంలో జల రవాణా కోసం ప్రభుత్వం ఇన్ ల్యాండ్ వాటర్ ట్రాన్స్ పోర్టు రెగ్యులేటరీ అథారటీ ఏర్పాటు చేయాలని భావిస్తోందన్నారు. ఈ రెగ్యూలేటరీ అథారటీ కోసం తక్షణ విధివిధానాలు రూపొందించాలని జలవనరులు, పోర్టు అధికారులను సీఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ అథారటీ కేవలం జల రవాణాను మాత్రమే పర్యవేక్షిస్తుందన్నారు. మరింత సమాచారానికి ఇతర రాష్ట్రాల్లో జల రవాణా కోసం అమలవుతున్న నిబంధనలను పరిశీలించాలన్నారు. 10 మెట్రిక్ టన్నుల బరువుల మోయగలిగే లాంచీలకు జలవనరుల శాఖ, ఆపై బరువులు మోయ గలిగే వాటికి పోర్టు అధికారులు అనుమతులివ్వాలని దిశానిర్దేశం చేశారు. ప్రయాణికుల పడవలకు పోర్టు అధికారుల అనుమతులివ్వాలన్నారు. అంతకుముందు రాష్ట్రంలో జల రవాణా కోసం తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ పోర్టు కోయా ప్రవీణ్...సీఎస్ కు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ తో పలు శాఖ ల ముఖ్య కార్యదర్శులు అనురాధ, అజయ్ జైన్, శశిభూషణ్, ఆర్థిక, టూరిజం, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related Posts