విజయవాడ, జూన్ 20,
ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్‌సభ స్థానాలున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనే నమ్మకం భారతీయ జనతాపార్టీ పెద్దలకు ఏ కోశానా లేదు. ఇక్కడున్న నేతలపై వారికి అంత నమ్మకం ఉంది. వారికి కావల్సింది లోక్‌సభ స్థానాలు. తెలుగుదేశం గెలిచినా, జనసేన గెలిచినా, వైసీపీ గెలిచినా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా 25 సీట్లు బీజేపీ ఖాతాలోనే పడతాయి.దేశవ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్ బలహీన స్థితిలో ఉందని చెప్పవచ్చు. బీజేపీ హయాంలో అందులోను ముఖ్యంగా నరేంద్రమోడీ, అమిత్ షా హయాంలో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కనపడటంలేదు. దక్షిణాదిలో బలపడటానికి ఇదే మంచి తరుణమని బీజేపీ భావిస్తున్నప్పటికీ ఆ పార్టీకి ఎక్కడా స్పేస్ లేదు. ఏపీలో వైసీపీ, టీడీపీ బలంగా ఉన్నాయి. తెలంగాణలో టీఆర్ ఎస్‌తోపాటు కాంగ్రెస్ కు కూడా క్షేత్రస్థాయిలో బలం ఉంది. తమిళనాడు, కేరళ సంగతి సరేసరి. కర్ణాటక ఒక్కటే బీజేపీకి ఊరట.ఉత్తరాదిలో తగ్గితే దక్షిణాదిలో పెంచుకోవాలి ఈసారి ఎన్నికలకు లోక్‌సభ స్థానాలు ఉత్తరాదివైపు తగ్గినా దక్షిణాదిలో పెంచుకోవాలనే ఉద్దేశంలో ఆ పార్టీ నేతలున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోగలిగింది. గట్టిగా కృషిచేస్తే ఎనిమిదికి తగ్గకుండా ఈసారి గెలుచుకోవాలనే యోచనలో ఆ పార్టీ నేతలున్నారు. తమిళనాడు నుంచి అన్నాడీఎంకే మద్దతు ఉంటుంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఢీకొట్టి మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకోగలమనే నమ్మకంతో ఉంది. ఏతావతా బీజేపీకి కలిగే నష్టం కేరళ. ఆ రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ సీటు కూడా గెలవగలిగే పరిస్థితి లేదు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సమైక్యంగా ఎన్నికలకు వెళితే బీజేపీకి ఆ సీట్లు కూడా కష్టమే. బీజేపీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే! ఏపీలో వైసీపీ అవసరాల దృష్ట్యా లోపాయికారీగా బీజేపీకి మద్దతిస్తోంది. తెలుగుదేశం కూడా బీజేపీవైపే చూస్తోంది. ఒకవేళ పొత్తు కుదిరితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తాయి. బీజేపీకి ఇష్టం లేకపోతే తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మాత్రం బీజేపీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి అవకాశం వస్తే బాగుంటుంది కదా అనే అత్యాశ మాత్రం ఆ పార్టీ రాష్ట్ర నేతల్లో వ్యక్తమవుతోంది