విజయవాడ, జూన్ 20,
ఆంధ్రప్రదేశ్‌లో ఏ క్షణంలోనైనా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అధికార, ప్రతిపక్షాలు కదనరంగంలోకి దూకాయి. గడప గడపకు ప్రభుత్వం పేరుతో అధికార పార్టీ, జిల్లాల పర్యటనలో చంద్రబాబునాయుడు ఉన్నారు. జనసేనాని అక్టోబరు 5వ తేదీ నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తుల విషయం ఇంకా ఖరారు కాలేదు. కానీ జనసేనతో పొత్తున బీజేపీ ఏపీలోని తెలుగుదేశం పార్టీపై గురిపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వర్గాలను నివ్వెర పరిచిన దాడులు చెన్నై నుంచి వచ్చిన ఈడీ ప్రత్యేక బృందాలు అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, జేడీ ప్రభాకర్‌రెడ్డి ఇళ్లపై అకస్మాత్తుగా దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీ వర్గాలను నివ్వెరపరిచింది. జేపీ ప్రభాకర్‌రెడ్డికి ఆఫ్రికాలో కూడా వ్యాపారాలున్నాయి. దేనిపై ఈడీకి ఫిర్యాదు అందిందన్నది స్పష్టత లేనప్పటికీ దాడులు మాత్రం జరిగాయి. వాస్తవానికి వారికి దివాకర్ ట్రావెల్స్ పేరుతో రవాణా వ్యాపారం ఉన్నప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై ఉక్కుపాదం మోపారు. గతంలో అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన బస్సులను అక్రమంగా రిజిస్టర్ చేశారన్న కారణంగా ఆయనపై కేసు నమోదు చేసి జైలుకు వెళ్లొచ్చారు. ఈశాన్య రాష్ట్రాలతో ఈ కేసుకు సంబంధం ఉండటంతో ఏపీ పోలీసులు ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదు ఆధారంగానే ఈడీ సోదాలు చేసిందని జేసీ అనుచరులు చెబుతున్నారు.పార్టీలో చేరకపోతే ఈడీ, సీబీఐ దాడులు? భారతీయ జనతాపార్టీ ఏపీ ఇన్‌ఛార్జి సునీల్ దేవధర్ ఇటీవల జేసీ ప్రభాకర్‌రెడ్డితో సమావేశమయ్యారు. తమ పార్టీలో చేరమని కోరారు. ఆయన నిరాకరించడంతో ఈడీ దాడులు జరిగాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఢిల్లీలోని పెద్దలు మాత్రం నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేస్తే ఆ లోటును బీజేపీతో భర్తీచేయాలనేది కేంద్ర పెద్దల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఏమాత్రం బలంలేని, కనీసం ఒకశాతం ఓటుబ్యాంకు కూడా లేని బీజేపీలో చేరడంవల్ల ఎటువంటి రాజకీయ జీవితం ఉండదనేది ఏపీలోని అన్ని పార్టీల నేతల ఏకాభిప్రాయంగా ఉంది. కోస్తాకు చెందిన సీనియర్ నేతతో కూడా మాట్లాడిన బీజేపీ నేతలు? తెలుగుదేశం పార్టీలో ఉన్న పారిశ్రామికవేత్తలతోపాటు బలమైన నేతలుగా ఉన్నవారందరిపై బీజేపీ దృష్టిసారించిందని భావిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన సూచనల మేరకు ఎవరెవరు పార్టీలోకి వస్తే బాగుంటుందో ఆలోచించుకొని వారందరితో సునీల్ దేవధర్ మాట్లాడుతున్నారు. ఎవరెవరితో మాట్లాడారన్నది పూర్తిగా తెలియనప్పటికీ చాలామంది నిరాకరించినట్లు తెలుస్తోంది. కోస్తాకు చెందిన ఒక బలమైన తెలుగుదేశం పార్టీ నేతతో కూడా మాట్లాడారని, ఆయన ఎటువంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. నిరాకరించినంతమాత్రాన ఈడీతో, సీబీఐతో వేధింపులకు పాల్పడటం మాత్రం సరైన రాజకీయం అనిపించుకోదంటూ బీజేపీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.ఇప్పుడు జేసీ సోదరులపై దాడులు జరిగాయి.. రేపు ఎవరి నివాసంలోనే, కార్యాలయంలోనే మళ్లీ ఈడీ దాడులు జరుగుతాయో.. ఆ నేతలతో బీజేపీ నేతలు మాట్లాడినట్లుగా అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.