విజయవాడ, జూన్ 20,
తెలుగుదేశం పార్టీ పక్కా వ్యూహంలో ముఖ్యమంత్రి జగన్ చిక్కుకుపోయారా? టీడీపీవారు ఆశించిందే జరుగుతుందా? వారి ప్రణాళిక విజయవంతమైందా? అనే ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది. జగన్‌ను ఒకవ్యూహం ప్రకారం రెచ్చగొట్టడం, ఆవేశంతో నిర్ణయాలు తీసుకునేలా చేయడం, వైసీపీ నేతల నుంచి తిట్ల దండకం వచ్చేలా వ్యవహరించడం అనేది తెలుగుదేశం పార్టీ ప్రణాళిక. అది విజయవంతమైనట్లే కనిపిస్తోంది. అయ్యన్నపాత్రుడిద్వారా వ్యూహం అమలు? అయ్యన్నపాత్రుడిని ఉపయోగించుకొని ముఖ్యమంత్రిపై, విజయసాయిరెడ్డిపై, ఇతర వైసీపీ నేతలపై తిట్ల దండకాన్ని ప్రయోగిస్తారు. జగన్ మనస్తత్వం అందరికీ తెలిసిందే కాబట్టి ఆయన్ను రెచ్చగొట్టేలా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరిస్తారు. రాజకీయాల్లో ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు విఫలమవుతాయి. అలా ఆవేశంతో జగన్ నిర్ణయాలు తీసుకునేలా వ్యవహరించడానికి, ఆయనపై తిట్ల దండకానికి అయ్యన్న ప్రయత్నాలు చేస్తున్నారు. చోడవరంలో నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో ఆయన ప్రయోగించిన భాష కూడా టీడీపీ వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ నేతల రక్షణాత్మక ధోరణి కొద్దిరోజులుగా వైసీపీ నాయకులు అయ్యన్నపాత్రుడిపై తిట్ల దండకాన్ని అందుకున్నారు. విజయసాయిరెడ్డి అందులో ముఖ్యులు. ఈ కోపాన్ని మొత్తం జగన్‌పై నెట్టేసిన అయ్యన్న తిట్ల దండకాన్ని అందుకున్నారు. అయ్యన్నను రెచ్చగొట్టి ఆయన ఏదో ఒకటి మాట్లాడితే జైలుకు పంపిద్దామని చూస్తున్న ప్రభుత్వానికి రివర్స్‌లో దాడి జరుగుతుండటంతో వైసీపీ నేతలు రక్షణాత్మక ధోరణిని అవలంబిస్తున్నారు. రాజకీయాలను రక్తికట్టిస్తున్న టీడీపీ, వైసీపీ! ఏపీలో తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వం వ్యూహప్రతివ్యూహాలతో రాజకీయాలను రక్తికట్టిస్తున్నాయి. ఒకరిపై మరొకరు తిట్ల దండకాన్ని అందుకుంటూ ప్రజలకు పూర్తిస్థాయిలో వినోదాన్ని పంచుతున్నారు. మన రాజకీయ నేతలు ఇలాకూడా ఉంటారా? అంటూ వారంతా ఆశ్చర్యపోయేలా వీరి విధానం ఉంది. ఎన్నికల సమయంలో కేవలం ప్రత్యర్థులుగా మాత్రమే తలపడి, ఎన్నికలైన తర్వాత గెలుపొందిన పార్టీకి సహకారం అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేయాల్సిన బాధ్యత భుజస్కంధాలపై ఉంటే, కాడిని కిందకి వదిలేసిన ఈ రాజకీయ నాయకులను రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.