విశాఖపట్టణం, జూన్ 21,
తేలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్నికలకు శ్రమించాల్సిందే. తన ఓటు బ్యాంకును పెంచుకోవాలంటే అన్ని రకాలుగా స్వేదం చిందించాల్సిందే. ఈసారి ఎన్నికల్లో కమ్యునిస్టులు తప్ప చంద్రబాబుతో ఎవరు కలవని పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్లూ జనసేనతో కలసి పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి చూస్తుంటే ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు దాదాపు ఒంటరిపోరుకు మానసికంగా సిద్ధమవ్వాల్సిందే. ఇప్పటి సిట్యుయేషన్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. మహానాడు సక్సెస్ కావడం, మినీ మహానాడులు విజయవంతం అవుతుండటం కొంత ఊరటనిచ్చే అంశమైనా.. ఎన్నికల నాటికి ఆ హీట్ ను చంద్రబాబు నిలబెట్టుకగలిగాలి. పర్చూరు లో పవన్ కల్యాణ్ ప్రసంగం విన్నవారికి ఎవరికైనా తాను ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లే కన్పిస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును తాను ఒక్కరే సొంతం చేసుకునేలా చంద్రబాబు ప్రయత్నించాల్సి ఉంటుంది. తనకు గత ఎన్నికలలో దూరమయిన సామాజిక వర్గాలను తిరిగి పార్టీ వైపునకు రప్పించుకునేలా చంద్రబాబు శ్రమించాల్సి ఉంటుంది. అన్నది ప్రశ్న. ఏపీలో వైసీపీ, టీడీపీ రెండూ బలంగానే ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈసారి జనసేనను కూడా అంత తీసేయాల్సిన పరిస్థితి కాదు. పవన్ ఒంటరిగా పోటీ చేసి కొద్దగొప్పో ఓట్లను చీలిస్తే అది చంద్రబాబు పార్టీకే నష్టం. 2019 ఎన్నికల్లో దాదాపు యాభై నియోజకవర్గాల్లో జనసేన దెబ్బకొట్టింది. ఆ అనుభవాన్ని చంద్రబాబు ఇంకా మర్చిపోలేదు. అలాగని జనసేన కు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసే బ్రాడ్ మైండ్ లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇక కుదరదు అనుకుంటే తప్ప ఎన్నికలకు ముందు పొత్తు సాధ్యం కాదన్నది వాస్తవం. మరోవైపు చంద్రబాబు పార్టీకి 175 నియోజకవర్గాల్లో క్యాడర్ ఉంది. నేతలు ఉన్నారు. యాభై శాతం యువకులకు ఇస్తామని ప్రకటించారు. మూడేళ్లు వరసగా ఓటమి పాలయిన వారికి సీట్లు లేవని చెప్పారు. కానీ ఆ మాటలన్నింటినీ ఇక అటక మీద పెట్టాల్సి ఉంటుంది. ఒంటరిగా పోటీ చేసినప్పుడు అలాంటి ప్రయోగాలు చంద్రబాబు చేయడు. అంత ధైర్యమూ లేదు. పాత నేతలే ఆయనకు మళ్లీ అవసరమవుతారు. మరో వైపు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేరు. ఇందుకు కొంత కసరత్తు చేయాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ పర్చూరు ప్రసంగం విన్న తర్వాత చంద్రబాబు కూడా ఇక తన ప్రయత్నాల్లో తాను ఉండక తప్పదు. ఒంటరిగా పోటీ చేసేందుకే పార్టీని సిద్ధం చేయాల్సి ఉంటుంది.