విశాఖపట్టణం,జూన్ 21,
స్వేచ్చగా ఉన్నప్పుడు భూతుపురాణం. పోలీసులు గాలిస్తుంటే అజ్ఞాతవాసం. ఇదీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్టైల్. పర్యాటకశాఖ మంత్రి ఆర్కేరోజాను కించపరిచేలా అయ్యన్న కామెంట్స్ చేయడం రాజకీయంగా దుమారం రేగుతోంది. చోడవరం మినీ మహానాడు వేదిక నుంచి ఆయన చేసిన వ్యాఖ్యాలపై అధికారపార్టీ భగ్గుమంది. వ్యక్తిగతంగా అయ్యన్నను టార్గెట్ చేసిన అధికారపార్టీ నేతలు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డం వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. మహిళా మంత్రినే కాదు పోలీసు అధికారులను అయ్యన్నపాత్రుడు తరచూ ఆక్షేపించడం వివాదాస్పదంగా మారుతోంది.ఉమ్మడి విశాఖజిల్లా టీడీపీకి అయ్యన్న పెద్దదిక్కుగా ఉన్నారు. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే ఆయన నైజం ఇప్పుడు మరింత రాటు దేలింది. ఎదుటి వాళ్లు ఒకటంటే.. అయ్యన్న పది అంటున్నారు. అందుకే మాజీ మంత్రి చుట్టూ వివాదాలు వైఫైలా చుట్టుకుని.. వరసగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో వివిధ స్టేషన్లలో అయ్యన్నపై 13 కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు పెట్టినా.. 30ఏళ్ల రాజకీయం ఒక లెక్క.. ఈ మూడేళ్లు మరో లెక్క అంటున్నారట మాజీ మంత్రి. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేవరకు “తగ్గేదే…లే” అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం. ఒక్క నోటి మాటే కాదు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా.. ఇలా సోషల్ మీడియా అకౌంట్స్‌లో యాక్టివ్‌గా ఉండే అయ్యన్న కేసులను సీరియస్‌గా తీసుకోవడం లేదట. కాకపోతే ఈ మూడేళ్లలో ఆయన దూకుడు అధికారపార్టీకే కాదు సొంతపార్టీలోని నాయకత్వాన్ని ఇరుకున పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అధికారపక్షం మాత్రం ఇక ఉపేక్షించేది లేదని గట్టిగా విరుచుకుపడుతోంది. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అయ్యన్నపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. విచారణ కోసం మాజీ మంత్రిని తీసుకెళ్లేందుకు పోలీసులు వచ్చిన ప్రతీసారీ నర్సీపట్నంలో హైడ్రామా నడుస్తోంది. ఇప్పుడు మాత్రం లెక్క మారుతుందని చెబుతున్నారు. ఆయన చుట్టూ వల పన్నడం.. ఉచ్చులో చిక్కడమే మిగిలిందని అధికారపార్టీ నాయకులు అనుకుంటున్నారు. మరి.. అయ్యన్న పాత్రుడు ఈసారి ఏం చేస్తారో చూడాలి.